అభివృద్ధికి విపక్షం అవరోధం
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:53 AM
దేశాభివృద్ధికి విపక్షం అవరోధంగా మారిందని ప్రధాని మోదీ ఆరోపించారు. శనివారం సర్దార్ పటేల్ 151వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని..
సోషల్ మీడియాలో విష ప్రచారం
సెక్యులర్ సివిల్ కోడ్, చొరబాట్లను అరికట్టడం.. తదుపరి లక్ష్యాలు: మోదీ
భారతీయులంతా ఐక్యంగా ఉండాలి
ఏక్తానగర్, అక్టోబరు 31: దేశాభివృద్ధికి విపక్షం అవరోధంగా మారిందని ప్రధాని మోదీ ఆరోపించారు. శనివారం సర్దార్ పటేల్ 151వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరిగిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘పదేళ్లకుపైగా అధికారానికి దూరంగా ఉండటంతో నిరాశా నిస్పృహలు పెరిగిపోయి ఇప్పుడిక బహిరంగంగా రంగంలోకి దిగారు. విదేశాల్లో రహస్యంగా ఎవరు ఎవరిని కలుస్తున్నారు? భారత వ్యతిరేకశక్తులు ఎవరికి మద్దతు ఇస్తున్నాయి? మన దేశ శత్రువుల భాషను ఎవరు మాట్లాడుతున్నారు?’ అంటూ ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించాలని కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, విషప్రచారాలు చేస్తున్నాయని ప్రధాని హెచ్చరించారు. దేశ ప్రతిష్ఠను మసకబార్చేలా సోషల్‌మీడియాను ఆయుధంగా వాడుకుంటూ వదంతులను వ్యాపింపజేస్తున్నారని.. ఈ శక్తులకు వ్యతిరేకంగా భారతీయులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత సమస్య తీవ్రంగా ఉందని, పలుదేశాల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై పరిమితులు విధిస్తున్నారని మోదీ తెలిపారు.
భారత్‌పైనా ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో భారత్ వ్యతిరేక శక్తులు క్రియాశీలకమయ్యాయని ప్రధాని తెలిపారు. అయితే, ఇంతటి సంక్షోభంలోనూ దేశప్రజలపై ఎటువంటి ప్రభావం లేకుండా చూడగలిగామని చెప్పారు. నక్సలిజాన్ని, మావోయిజాన్ని అంతమొందించామని.. కానీ, మేధోనక్సల్స్ ముప్పు ఇంకా తీవ్రంగానే ఉందని మోదీ అన్నారు. భవిష్యత్ లక్ష్యాలను వివరిస్తూ.. ‘దేశ సరిహద్దులను పటిష్ఠపర్చటం, చొరబాట్లను, జనాభాపరమైన మార్పులను అరికట్టటం, సెక్యులర్ సివిల్ కోడ్‌ను తీసుకురావటం లక్ష్యంగా భారత్ తదుపరి అడుగులు ఉంటాయి’ అని మోదీ వెల్లడించారు.