‘నారీ శక్తి’పై మాది దృఢ సంకల్పం
ABN , Publish Date - Nov 30 , 2026 | 03:17 AM
‘‘మహిళలకు సాధికారత కల్పించడంలో బీజేపీ సహా ఎన్డీయే కూటమిది దృఢ సంకల్పం. అది ఎక్కడా చెక్కుచెదరలేదు.’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
ఎన్డీయేకు జాతి ప్రయోజనాలే సర్వోన్నతం: మోదీ
న్యూఢిల్లీ, నవంబరు 29: ‘‘మహిళలకు సాధికారత కల్పించడంలో బీజేపీ సహా ఎన్డీయే కూటమిది దృఢ సంకల్పం. అది ఎక్కడా చెక్కుచెదరలేదు.’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. జాతి ప్రయోజనాలే తమకు సర్వోన్నతమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ సహా మహిళా బిల్లుల ఆమోదం కోసం సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం ప్రధాని మోదీ సామాజిక మాధ్యంలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు వీగిపోయిన దరిమిలా సుదీర్ఘ విరామానంతరం ఈ విషయంపై ప్రధాని తొలిసారి స్పందించారు. ‘‘నారీ శక్తి వందన్.. సవరణ బిల్లు ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ప్రస్తుతం ఇది ఎంతో అవసరం.’’ అని వ్యాఖ్యానించారు. నారీశక్తి సాధికారత పట్ల బీజేపీ, ఎన్డీయేల సంకల్పం దృఢంగా ఉందని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నది దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటమని, దీనిలో తాను కూడా ఉన్నానని ప్రధాని తెలిపారు.