ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోదీ
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:12 AM
చనిపోయిన ఆరేళ్ల తర్వాత కూడా అమెరికాను కుదిపేస్తున్న సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ పేరు.. తాజాగా భారత రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
ఇజ్రాయెల్‌లో ట్రంప్ కోసం మోదీ ఆడి పాడారు
అమెరికా సెక్స్ కుంభకోణం సూత్రధారి ఎప్‌స్టీన్
తాజాగా విడుదలైన పత్రాల్లో ప్రధాని మోదీ పేరు
ఇజ్రాయెల్ పర్యటన తప్ప అంతా అబద్ధం
భారత విదేశాంగ శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జనవరి 31: చనిపోయిన ఆరేళ్ల తర్వాత కూడా అమెరికాను కుదిపేస్తున్న సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ పేరు.. తాజాగా భారత రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అమెరికా న్యాయ శాఖ తాజాగా విడుదల చేసిన ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో భారత ప్రధాని మోదీ పేరు కనిపించటం సంచలనంగా మారింది. ఎప్‌స్టీన్ రాసిన ఓ మెయిల్‌లో ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ కొన్ని వాక్యాలు రాశాడు. ‘భారత ప్రధాని మోదీ (నా) సలహా తీసుకున్నారు. ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడి కోసం డ్యాన్స్ చేశారు. పాట పాడారు. వాళ్లు (మోదీ, ట్రంప్) కొన్ని వారాల క్రితమే కలుసుకున్నారు. ఇది పనిచేసింది’ అని ఎప్‌స్టీన్ మెయిల్‌లో ఉంది. ఎప్‌స్టీన్ మెయిల్‌పై భారత విదేశాంగశాఖ స్పందించింది. 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించిన విషయం తప్ప ఆ మెయిల్‌లో ఉన్న ఇతర వివరాలన్నీ పచ్చి అబద్ధమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ శనివారం కొట్టిపారేశారు. తీవ్రమైన లైంగిక కుంభకోణంలో దోషి అయిన వ్యక్తి చెప్పిన మాటలు అర్థంలేనివని పేర్కొన్నారు. 2017 జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటించారు.
మోదీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోదీ పేరు ఉండటంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ అంశంపై మూడు ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా శనివారం డిమాండ్ చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ నుంచి ప్రధాని ఏం సలహా తీసుకున్నారు? అమెరికా అధ్యక్షుడి కోసం ఇజ్రాయెల్‌లో మోదీ డ్యాన్స్ చేశారు.. పాట పాడారు అనేదానికి అర్థం ఏమిటి? మెయిల్‌లో ‘ఇది పనిచేసింది’ అనే పదం ఉంది. అంటే ఏం పనిచేసింది? ఏ పని విజయవంతమైంది? అని పవన్ ఖేరా ప్రశ్నించారు. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీ పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించింది.