Share News

భారత్‌పై కన్నేస్తే మీ భరతం పడతాం!

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:24 AM

ఉగ్రవాదం విషయంలో భారత్‌ ‘జీరో టాలరెన్స్‌’ విధానం అమలు చేస్తోందని... దాని ఫలితాలు అందరూ చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.

భారత్‌పై కన్నేస్తే మీ భరతం పడతాం!

  • ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక

  • డ్రగ్స్‌పై పోరులో భాగస్వాములవ్వండి

  • ‘మన్‌ కీ బాత్‌’లో యువతకు ప్రధాని పిలుపు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదం విషయంలో భారత్‌ ‘జీరో టాలరెన్స్‌’ విధానం అమలు చేస్తోందని... దాని ఫలితాలు అందరూ చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. మన దేశం వంక కన్నెత్తి చూసే ఉగ్రవాదుల భరతం పడతామని హెచ్చరించారు. ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా దశాబ్దం కింద పాకిస్థాన్‌పై చేసిన బాలాకోట్‌ సర్జికల్‌ దాడులు, గత ఏడాది చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఈ దిశగా చేపట్టినవేనని స్పష్టంచేశారు. ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన ‘మన్‌ కీ బాత్‌’ 138వ సంచికలో ఆయన ప్రసంగించారు. దేశ భద్రతే ప్రథమ లక్ష్యమని, ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. భారత్‌ సాధించిన చరిత్రాత్మక ఘనతల్లో ఒకటైన బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిగి సోమవారానికి పదేళ్లు పూర్తవుతున్నాయని గుర్తుచేశారు. కాగా, యువత డ్రగ్స్‌ బారిన పడుతుండడంపై ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్‌పై పోరాటంలో పాల్గొనాలని పిలుపిచ్చారు. కేంద్రం ప్రారంభించిన ‘నషా ముక్త్‌ యువ అభియాన్‌’లో కోట్ల మంది పాల్గొంటున్నారని.. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిన చేస్తున్నారని చెప్పారు. తమదైన భాషలో సందేశమిస్తున్నారని తెలిపారు. ఈ పోరులో సృజనాత్మక ఉపయోగించి పాలుపంచుకోవాలని మరోసారి కోరుతున్నానని చెప్పారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జనాభా లెక్కల సేకరణలో పాల్గొనడం జాతీయ కర్తవ్యమని మోదీ అన్నారు. దేశ భవిష్యత్‌కోసం రూపొందించే ప్రణాళికల కోసం జనాభాకు సంబంధించిన కచ్చితమైనా డేటా అవసరమని.. ప్రజలు ఆన్‌లైన్‌లో తమ వివరాలు స్వయంగా నమోదు చేయాలని పిలుపిచ్చారు. అక్టోబరు 2న గాంధీ జయంతిని ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ప్రధాని ప్రస్తావించారు.

Updated Date - Sep 28 , 2026 | 06:25 AM