Share News

యవత కలలకు పెను సవాలుగా డ్రగ్స్‌

ABN , Publish Date - Nov 30 , 2026 | 04:05 AM

మాదకద్రవ్యాల వ్యసనం దేశ యువత కలలకు పెను సవాలుగా మారిందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం 140వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

యవత కలలకు పెను సవాలుగా డ్రగ్స్‌

  • ‘మన్‌ కీ బాత్‌’లో రప్రధాని మోదీ

న్యూఢిల్లీ, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల వ్యసనం దేశ యువత కలలకు పెను సవాలుగా మారిందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం 140వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాకారం చేసుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడుతూనే డ్రగ్స్‌ అలవాటు వారి భవిష్యత్తును దెబ్బతీస్తోందని తెలిపారు. వ్యసనానికి బానిసలై, ఆ తర్వాత దృఢ సంకల్పంతో దాన్ని అధిగమించినవారు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ వ్యసనాన్ని జయించిన ఓ యువకుడితో మోదీ మాట్లాడారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సమాజంలో చైతన్యం పెరుగుతుండటంపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ‘నషా ముక్త్‌ యువ అభియాన్‌’ జోరుగా సాగుతోందని పేర్కొన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), ఇతర నైపుణ్యాలను నేర్చుకోవడంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆసక్తి గురించి మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘ఐగాట్‌ కర్మయోగి ప్లాట్‌ఫాం కింద 17 భాషల్లో 7వేలకు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏఐ, నూతన సాంకేతికతలకు సంబంధించిన 200కు పైగా కోర్సులను 1.25 కోట్ల మంది పూర్తి చేశారు’ అని మోదీ పేర్కొన్నారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్‌ ఫోన్లను బ్లాక్‌ చేయడానికి వినియోగదారులకు సహాయపడే ‘సంచార్‌ సాథీ’ పోర్టల్‌ను 23 కోట్ల మందికి పైగా సందర్శించారని తెలిపారు. సుమారు 3కోట్ల మందికిపైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెప్పారు. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 14 లక్షలకు పైగా పోయిన ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అప్పగించినట్లు చెప్పారు. కెనడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి మోదీ వివరించారు. ఎవరూ ఆకలితో నిద్ర పోకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్న ‘సాయిధామ్‌ ఫుడ్‌ బ్యాంక్‌’ గ్రేటర్‌ టొరంటో, హామిల్టన్‌ ప్రాంతాల్లో ప్రతినెలా సుమారు 60 వేల మందికి సహాయం అందిస్తోందని చెప్పారు.


శెభాష్‌ వివేక్‌..!

నెల్లూరుకు చెందిన యువకుడు వివేక్‌ సేవలను మోదీ ప్రశంసించారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా అతను వ్యవహరించిన తీరును కొనియాడారు. సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న 900కు పైగా అనుమానాస్పద, నకిలీ ఫోన్‌ నంబర్లను వివేక్‌ ‘సంచార్‌ సాథీ’లో రిపోర్ట్‌ చేశారని ప్రధాని తెలిపారు. ఆయన అందించిన సమాచారంతో దేశవ్యాప్తంగా సుమారు 17వేల నకిలీ మొబైల్‌ కనెక్షన్లను అధికారులు తొలగించగలిగారని పేర్కొన్నారు. ఇటువంటి చిన్న ప్రయత్నాలు దేశంలోని ఏదో ఒక మూలన ఉన్న సామాన్య కుటుంబాల జీవితకాల పొదుపును కాపాడతాయన్నారు.

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ యూత్‌ గేమ్స్‌

తెలంగాణలోని ఆరు నగరాల్లో డిసెంబరు 11 నుంచి 22 వరకు 8వ ‘ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌’ జరగనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. భారత క్రీడా రంగం సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోందని తెలిపారు. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ మన యువ క్రీడాకారులకు గొప్ప అవకాశమని అభివర్ణించారు. క్రీడల్లో పాల్గొనబోయే అథ్లెట్లందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ‘బాగా ఆడండి.. ఉన్నతంగా ఎదగండి’ అని ప్రోత్సహించారు.

Updated Date - Nov 30 , 2026 | 04:08 AM