Share News

ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్సే

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:01 AM

మీడియా రంగంలో గత కొన్ని దశాబ్దాల్లో వచ్చిన సమూల మార్పులకు తానే ప్రత్యక్ష సాక్షిని అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గతంలో మీడియాలో వార్తలు రావాలంటే..

ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్సే

  • మీడియాలో వచ్చిన సమూల మార్పులకు నేనే సాక్షిని

  • ఇప్పుడు ఎక్కడ చూసినా వార్తా విశ్లేషకులే ఉంటున్నారు

  • మీడియాతో నాది సుదీర్ఘకాల సన్నిహిత అనుబంధం

  • జర్నలిస్టులతో దివాలీ మిలన్‌ సమావేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, నవంబరు 12: మీడియా రంగంలో గత కొన్ని దశాబ్దాల్లో వచ్చిన సమూల మార్పులకు తానే ప్రత్యక్ష సాక్షిని అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గతంలో మీడియాలో వార్తలు రావాలంటే ప్రెస్‌ నోట్‌లు పంపేవారమని, ఇప్పుడు వార్తలన్నీ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లోనే తెలిసిపోతున్నాయని తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘దివాలీ మిలన్‌’ కార్యక్రమంలో ఆయన జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. జర్నలిస్టులతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ‘బీజేపీలో చేరిన కొత్తలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగితే నేనే కుర్చీలు వేసేవాడిని. ఢిల్లీకి వచ్చిన తర్వాత కూడా ఆ పని చేశాను. 1990ల్లో పార్టీ నిర్వహించిన రెండు ప్రధాన యాత్రల సమయంలో మీడియాతో సమన్వయం చేసే బాధ్యతను నేనే నిర్వహించాను. ఆ కాలంలో మీడియా సంస్థలకు వార్తలు పంపేందుకు ఫ్యాక్స్‌ యంత్రాల కోసం వెదికేవాళ్లం. ఇప్పుడు ఓబీ వ్యాన్లు కూడా పోయాయి. చేతిలోని స్మార్ట్‌ ఫోనే ఓబీ వ్యాన్‌గా మారిపోయింది. దేశంలో గతంలో గల్లీకి ఒక క్రికెట్‌ నిపుణుడు ఉండేవాడు. బ్యాటింగ్‌ ఎలా చేయాలో సచిన్‌ టెండుల్కర్‌కు కూడా ఉచిత సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వార్తా విశ్లేషకులే ఉంటున్నారు. ఎవరికి వారు సొంత చానల్‌, పాడ్‌కా్‌స్టలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మీడియా రంగంలో నాకు మొదటి నుంచీ పరిచయం ఉన్న పాత జర్నలిస్టు మిత్రులు కొంతమందే ఉన్నారు. చాలామంది కొత్తవాళ్లు ఈ రంగంలోకి వచ్చారు. నిజంగా వర్కింగ్‌ జర్నలిస్టుల విధి నిర్వహణ కత్తిమీద సామే. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు అందరూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలని చూస్తే.. ఫీల్డ్‌ జర్నలిస్టులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదాలకు ఎదురెళ్తారు. దేశంలోని అన్ని కుటుంబాలు పండుగల సమయంలో సంతోషంగా గడుపుతుంటే.. జర్నలిస్టులు బ్రేకింగ్‌ న్యూస్‌ కోసం కష్టపడుతుంటారు’ అని మోదీ పేర్కొన్నారు.


నా గల్లా పట్టుకొని స్వీట్స్‌ అడిగారు..

‘2001లో నన్ను గుజరాత్‌ సీఎంగా పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఆ విషయం పార్టీలోని ఒకరిద్దరు పెద్దలకు మాత్రమే తెలుసు. కానీ, ఒకరోజు కొందరు జర్నలిస్టులు నా గదిలోకి వచ్చి శుభాకాంక్షలు తె లిపారు. వారిలో ప్రభావవంతమైన మహిళా బృందం ఉండేది. వాళ్లు అభిమానంగా నా గల్లా పట్టుకొని మరీ స్వీట్లు అడిగారు. స్వీట్లు ఎందుకని నేను ప్రశ్నిస్తే.. సీఎంగా ఎంపికైనందుకు అని చెప్పా రు. ఆ విషయం తెలియదని చెప్పినా వాళ్లు నమ్మలేదు. ఇక విషయం బయటకు పొక్కింది కదా అని అందరికీ స్వీట్లు పంచాను’ అని మోదీ వివరించారు. కాగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ శామ్‌ పిట్రోడాకు ప్రధాని మోదీ గురువారం దీపావళి, గుజరాత్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తన గురించి పిట్రోడా సానుకూల వ్యాఖ్యలు చేయడంతో మోదీ శుభాకాంక్షలతో స్పందించారు.

Updated Date - Nov 13 , 2026 | 03:02 AM