ఉద్రిక్తతల తగ్గింపునకు చర్చలు, దౌత్యమే మార్గం
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:53 AM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వివిధ దేశాల నేతలతో చర్చలు జరిపారు. యుద్ధం విస్తృతి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో...
పశ్చిమాసియా పరిస్థితిపై పలు దేశాల నేతలతో మోదీ చర్చలు
న్యూఢిల్లీ, మార్చి 19: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వివిధ దేశాల నేతలతో చర్చలు జరిపారు. యుద్ధం విస్తృతి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆయన జరిపిన ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉద్రిక్తతల తగ్గింపునకు చర్చలు, దౌత్యమే మార్గమని మరోసారి నొక్కి చెప్పారు. ఈ విషయాలను ఆయన ఎక్స్ ద్వారా తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఒమన్ సుల్తాన్, యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు, మలేసియా ప్రధానిలతో ఆయన మాట్లాడారు. ‘‘నా ప్రియమైన మిత్రుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో మాట్లాడాను. పశ్చిమాసియాలో చాలా అత్యవసరంగా ఉద్రిక్తతలు తగ్గాల్సిన అవసరం ఉంది. సంప్రదింపులు, దౌత్యమే ఇందుకు మార్గమ’’ని మోదీ పేర్కొన్నారు. ఒమన్ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్‌తో చర్చలు జరిపారు. ఒమన్ దేశ ప్రజలకు ముందస్తుగా ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘నా సోదరుడు సుల్తాన్‌తో మాట్లాడినట్టు’ మోదీ పేర్కొన్నారు. ఒమన్ సార్వభౌమ అధికారం, పాద్రేశిక సమగ్రతకు భంగం కలిగిస్తున్న చర్యలను ఖండించారు. శాంతి, సుస్థిరతలను పునరుద్ధరించాల్సి ఉందని పేర్కొన్నారు. వేలాది మంది భారతీయులను సురక్షితంగా తిప్పి పంపించేందుకు ఆ దేశం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. కువైత్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌తోనూ సంప్రదింపులు జరిపారు. శాంతి, సుస్థిరత సాధనకు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు. ఇంధనవనరులపై దాడులను ఖండించారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతోనూ చర్చలు జరిపారు.