Share News

ఏఐ నియంత్రణ మన చేతుల్లో ఉండాలి

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:39 AM

నానాటికీ విస్తరిస్తున్న కృత్రిమ మేధ పరిజ్ఞానం కొన్ని పెద్ద దేశాలకో, అంతర్జాతీయ కంపెనీలకో మాత్రమే పరిమితం కాకూడదని.. దాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని.. ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.....

ఏఐ నియంత్రణ మన చేతుల్లో ఉండాలి

  • కృత్రిమ మేధ ప్రజలకు అందుబాటులోకి రావాలి

  • మానవాళికి ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యం కావాలి

  • నాగరికత దిశ మార్చిన నిప్పు, లిపిలాంటిదే ఏఐ కూడా!

  • భారత్‌ ఏఐలో భయాన్ని కాదు.. అదృష్టాన్ని చూస్తోంది

  • ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

  • కృత్రిమ మేధకు సంబంధించి ‘మానవ్‌’ విజన్‌ ఆవిష్కరణ

న్యూడిల్లీ, ఫిబ్రవరి 19: నానాటికీ విస్తరిస్తున్న కృత్రిమ మేధ పరిజ్ఞానం కొన్ని పెద్ద దేశాలకో, అంతర్జాతీయ కంపెనీలకో మాత్రమే పరిమితం కాకూడదని.. దాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని.. ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయితే దానిపై నియంత్రణ మాత్రం మన చేతుల్లోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఏఐకి మనం పూర్తిస్థాయిలో అవకాశం ఇవ్వాలి. కానీ నియంత్రణ మాత్రం మన చేతుల్లోనే ఉంచుకోవాలి.. అచ్చం జీపీఎ్‌సలాగా. అది మనకు మార్గాలను సూచిస్తుంది. కానీ ఎలా వెళ్లాలనే తుది నిర్ణయం మనదే కదా’’ అని వివరించారు. ఢిల్లీలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌’లో గురువారం ప్రసంగించిన మోదీ.. ప్రపంచ జనాభాలో ఆరో వంతు మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్‌లో ఈ సదస్సు జరగడం ఇండియాకే కాక, గ్లోబల్‌ సౌత్‌కు గర్వకారణమన్నారు. వ్యవసాయం, భద్రత, దివ్యాంగులకు సహాయం వంటి అంశాలకు సంబంధించి ఈ సమ్మిట్‌లో పలు కంపెనీలు ప్రదర్శించిన పరిష్కారాలు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ శక్తికి, దేశ ఆవిష్కరణ సామర్థ్యాలకు శక్తివంతమైన ఉదాహరణలని పేర్కొన్నారు. ఈ సదస్సులో 3 భారత కంపెనీలు తమ స్వంత ఏఐ మోడళ్లను, యాప్‌లను ప్రారంభించాయని చెప్పడానికి తాను గర్విస్తున్నానన్నారు. ఏఐ వినియోగం మానవాళికి ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా (హ్యూమన్‌ సెంట్రిక్‌గా) ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘‘మానవ చరిత్రలో ప్రతి కొన్ని శతాబ్దాలకూ ఒక మలుపు వస్తుంది. అది నాగరికత దిశను, అభివృద్ధి వేగాన్ని, మనం ఆలోచించే, అర్థం చేసుకునే, పనిచేసే విధానాలను సమూలంగా మార్చేస్తుంది. మనం అటువంటి మార్పుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు దాని అసలైన ప్రభావాన్ని అరుదుగా గుర్తిస్తాం. రాళ్లను రాపిడి చేసినప్పుడు తొలిసారిగా వచ్చిన నిప్పురవ్వలు నాగరికతకు పునాది అవుతాయని అప్పుడు ఎవరూ ఊహించలేదు. మాట లిపిగా మారినప్పుడు రాతపూర్వక జ్ఞానం భవిష్యత్‌ వ్యవస్థలకు వెన్నెముక అవుతుందని ఎవరూ అంచనా వేయలేదు. ఎలాంటి తీగలూ లేకుండా (వైర్‌లెస్‌) సంకేతాలు మొదటిసారి ప్రసారమైనప్పుడు.. ఏదో ఒకనాటికి ప్రపంచమంతా రియల్‌ టైమ్‌లో అనుసంధానమవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కృత్రిమ మేధ కూడా అలాంటి మార్పే. ఏఐ యంత్రాలను తెలివైనవిగా మారుస్తోంది.


మానవ సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుతోంది. అయితే.. ప్రస్తుత తరంతో పాటు, భవిష్యత్‌ తరాలకు మనం ఎటువంటి ఏఐని అందిస్తామో కూడా ఆలోచించాలి’’ అని పేర్కొన్నారు. ఏఐ పట్ల భారతదేశ దృక్పథాన్ని ఈ సదస్సు ఇతివృత్తం (సర్వజన హితాయ, సర్వజన సుఖాయ.. అంటే, అందరి సంక్షేమం, అందరి సంతోషం)లో స్పష్టంగా ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కృత్రిమ మేధను అందరితో పంచుకుంటేనే, దాని కోడ్‌ అందరికీ అందుబాటులో ఉంటేనే (డెమొక్రటైజేషన్‌) అది మానవాళికి నిజంగా మేలు చేయగలదని భారత్‌ విశ్వసిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈమేరకు.. ఆయన కృత్రిమ మేధకు సంబంధించిన ‘మానవ్‌’ విజన్‌ను ఆవిష్కరించారు. ‘‘మానవ్‌లో ఎం అంటే.. మోరల్‌, ఎథికల్‌ సిస్టమ్స్‌. అంటే నైతిక విలువలు, మార్గదర్శకాల ఆధారంగా ఏఐ అభివృద్ధి చెందాలి. ఏ అంటే అకౌంటబిల్‌ గవర్నెన్స్‌ (జవాబుదారీపాలన). పారదర్శకమైన నిబంధనలు, పటిష్ఠ పర్యవేక్షణ ఉండాలి. ఎన్‌ అంటే నేషనల్‌ సావర్నిటీ (జాతీయ సార్వభౌమాధికారం). అంటే.. సృష్టించినవారికే డేటా చెందుతుంది. ఏ అంటే యాక్సెసిబుల్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ (అందుబాటు, సమ్మిళితం). అంటే.. ఏఐపై ఏ ఒక్కరికో గుత్తాధిపత్యం ఉండకూడదు. అందరికీ వృద్ధికారకంగా ఉండాలి. వి అంటే వ్యాలీడ్‌, లెజిటిమేట్‌ (చెల్లుబాటు, చట్టబద్ధత). అంటే.. ఏఐ ఇచ్చే సమాచారం చట్టబద్ధంగా (ఆయా దేశాల చట్టాలకు లోబడి), ధ్రువీకరించదిగినదిగా ఉండాలి. ఈ 21వ శతాబ్దపు ఏఐ ఆధారిత ప్రపంచంలో మానవ సంక్షేమానికి.. భారతదేశం రూపొందించిన ఈ ‘మానవ్‌’ విజన్‌ ఒక ప్రధానమైన లంకెగా ఉంటుంది’’ అని ప్రధాని వివరించారు. ఏఐని చూసి భయపడేవారు, దాంట్లో అదృష్టాన్ని చూసేవారు ఉంటారని.. ఏఐని చూసి భారత్‌ భయపడట్లేదని, దాన్నొక అదృష్టంగా, రేపటికి కార్యాచరణ ప్రణాళికగా చూస్తోందని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌ ఆలోచన భిన్నం..

దశాబ్దాల క్రితం ఇంటర్నెట్‌ ప్రారంభమైనప్పుడు అది ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందో ఎవరూ ఊహించలేదని.. ఏఐ విషయంలోనూ అదే జరుగుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాలు, కంపెనీలు ఏఐని తమ వ్యూహాత్మక ఆస్తిగా భావిస్తాయని.. దాన్ని రహస్యంగా అభివృద్ధి చేయాలనుకుంటాయని.. కానీ భారత్‌ అందుకు భిన్నంగా ఆలోచిస్తుందన్నారు. ‘‘ఏఐ కోడ్స్‌ బహిరంగంగా ఉండి, అందరూ పంచుకుంటే.. లక్షలాది మంది యువ మేధావులు వాటిని మరింత సురక్షితంగా, మెరుగ్గా మార్చగలరు. ఏఐని ప్రపంచంలోని అందరి శ్రేయస్సు కోరేలా అభివృద్ధి చేయడానికి మనం కృతనిశ్చయంతో ఉందాం’’ అని పిలుపునిచ్చారు. అలాగే.. ఏఐ దుర్వినియోగంపైనా ప్రధాని ఆందోళన వెలిబుచ్చారు. డీప్‌ఫేక్‌ వీడియోలు, కల్పిత కంటెంట్‌ సమాజాలను అస్థిరపరుస్తున్నాయని.. డిజిటల్‌ ప్రపంచంలో కంటెంట్‌ వాస్తవమైనదా, ఏఐ సృష్టించిందా తెలిపే వాటర్‌మార్కింగ్స్‌ ఉండాలని అభిప్రాయపడ్డారు. సాంకేతికతలో మొదటి నుంచే నమ్మకాన్ని అంతర్భాగం చేయాలన్నారు. ఈ ఏఐ యుగంలో పిల్లల భద్రత విషయంలోనూ మరింత అప్రమత్తంగా ఉండాలని, పాఠశాల పాఠ్యప్రణాళికను రూపొందించినంత జాగ్రత్తగా.. ఏఐ విషయంలో పిల్లలకు మార్గదర్శకత్వం చేయాలన్నారు. కాగా.. ప్రధాని ప్రసంగాన్ని ఏఐ సహాయంతో 11 భారతీయ భాషలతోపాటు బధిరులకు అర్థమయ్యేలాగా సైగల భాషలోకి అప్పటికప్పుడు అనువదించడం విశేషం.


‘‘కృత్రిమ మేధ భవిష్యత్తులో ఏం చేస్తుందన్నది కాదు... దాంతో ఈరోజు మనం చేయదలచుకున్నామన్నదే అసలైన ప్రశ్న. మానవాళి గతంలో కూడా ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొంది. దీనికి అత్యంత శక్తిమంతమైన ఉదాహరణ.. అణుశక్తి. దాని విధ్వంసక శక్తినీ మనం చూశాం. దానివల్ల కలుగుతున్న ప్రయోజనాలనూ చూస్తున్నాం. ఏఐ కూడా అలా మానవాళి గతిని మార్చే శక్తి కలదే. దానికి సరైన దిశానిర్దేశం లేకపోతే విచ్ఛిన్నానికి దారి తీస్తుంది. సరైన మార్గంలో నడిపిస్తే అది ఒక పరిష్కారంలా మారుతుంది. ఏఐని యంత్ర కేంద్రీకృతం (మెషీన్‌ సెంట్రిక్‌)గా కాకుండా మానవ కేంద్రీకృతం (హ్యూమన్‌ సెంట్రిక)గా.. నిర్లక్ష్యంగా కాకుండా సున్నితంగా, బాధ్యతాయుతంగా ఎలా అభివృద్ధి చేయాలన్నదే ఈ సమ్మిట్‌ ప్రధాన లక్ష్యం.

- ప్రధాని మోదీ

1.jpg

ఓపెన్‌ ఏఐ వర్సెస్‌ ఆంత్రోపిక్‌

  • ప్రధాని మోదీతో గ్రూప్‌ ఫొటో దిగే సమయంలో.. చేతులు కలపడానికి ఇష్టపడని శామ్‌ ఆల్ట్‌మన్‌, డేరియో

రాజకీయాల్లో అయినా వ్యాపారంలో అయినా.. ప్రత్యర్థులను శత్రువుల్లా చూడటం చాలా అరుదు! ఒకవేళ మనసులో కోపాలున్నా.. నలుగురు కలిసే వేదికలపైకి వచ్చినప్పుడు మొహమాటానికైనా చేతులు కలుపుతారు!! కానీ, చాట్‌ జీపీటీ, క్లాడ్‌ వంటి అత్యంత అధునాతన ఏఐ మోడళ్లను ప్రపంచానికి అందించిన ఓపెన్‌ ఏఐ, ఆంత్రోపిక్‌ సంస్థల చీఫ్‌లు భిన్నంగా ప్రవర్తించారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్‌ సదస్సుకు ఓపెన్‌ ఏఐ శామ్‌ ఆల్ట్‌మన్‌, ఆంత్రోపిక్‌ సీఈవో డేరియో, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సహా అంతర్జాతీయ దిగ్గజ టెక్‌ సంస్థల అధిపతులు పలువురు హాజరయ్యారు. గురువారం ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీతో వీరందరూ గ్రూప్‌ ఫొటో కోసం వేదికపైకి వెళ్లారు. మోదీ తనకు కుడి, ఎడమల నిలబడిన సుందర్‌ పిచాయ్‌, శామ్‌ ఆల్ట్‌మన్‌ల చేతులు పట్టుకుని పైకి లేపి.. మిగతా అందరూ అలాగే చేశారు. పక్కపక్కనే ఉన్న శామ్‌ ఆల్ట్‌మన్‌, డేరియో ఒకరిచేతులు ఒకరు పట్టుకోకుండా పిడికిలి బిగించి నిలబడ్డారు. ఆ వీడియో క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. డేరియో ఒకప్పుడు ఓపెన్‌ ఏఐలో వైస్‌ప్రెసిడెంట్‌ (రిసెర్చ్‌)గా శామ్‌ఆల్ట్‌మన్‌ నాయకత్వంలోనే పనిచేశారు. 2021 లో ఆ సంస్థ నుంచి బయటకొచ్చేసి ఆంత్రోపిక్‌ను స్థాపించారు. ఓపెన్‌ ఏఐలో కంప్యూటర్ల సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారిస్తున్నారే తప్ప.. ఏఐ మోడల్స్‌కు విలువలను నేర్పట్లేదని, అందుకే తాను బయటకొచ్చానని 2023లో ఓ మ్యాగజైన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 02:39 AM