శక్తితోనే సాధించాం!
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:20 AM
అంతర్జాతీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా స్థిరమైన వృద్ధితో భారత్ నేడు ప్రపంచానికి గొప్ప ఆర్థిక వృద్ధి కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద.....
వాణిజ్య ఒప్పందాల్లో బలమైన స్థితిలో ఉండి చర్చలు
పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ
జాగ్రత్తగా తయారుచేసిన స్ర్కిప్టు ప్రకారమే ఇంటర్వ్యూ: కాంగ్రెస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: అంతర్జాతీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా స్థిరమైన వృద్ధితో భారత్ నేడు ప్రపంచానికి గొప్ప ఆర్థిక వృద్ధి కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) చర్చల్లో బలమైన స్థానంలో ఉండి బేరసారాలు నిర్వహించగలుగుతోందని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం వాణిజ్య ఒప్పందాల విషయంలో ఆత్మవిశ్వాసంతో బేరమాడే స్థితిలో లేకపోవటంతో ఒప్పందాలు కుదరలేదని విమర్శించారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఆదివారం ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్ నుంచి వివిధ దేశాలతో ఎఫ్‌టీఏలు, దేశ వృద్ధి ప్రస్థానం, వికసిత్ భారత్ భవిష్యత్ లక్ష్యాలు తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
బలమైన స్థానంలో ఉండి బేరమాడాం
అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ప్రతిపక్షాల విమర్శలను ప్రధాని తిప్పికొట్టారు. ట్రేడ్ డీల్స్ చర్చల్లో బలమైన స్థానంలో ఉండి బేరసారాసాలు నిర్వహించామని తెలిపారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించటంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగింది. దానివల్లే మేం బలమైన స్థితిలో ఉండి వాణిజ్య ఒప్పంద చర్చల్లో బేరసారాలు నిర్వహించగలిగాం. వస్త్రాలు, తోలు, కెమికల్స్, చేతివృత్తులు, రత్నాలు తదితర రంగాల్లో ఎంఎ్‌సఎంఈ పరిశ్రమలు మరింత విస్తరించేలా ఎఫ్‌టీఏలను డిజైన్ చేశాం’ అని ప్రధాని మోదీ విమర్శిచారు.
ప్రైవేటు రంగానిదే కీలకపాత్ర
దేశ అభివృద్ధిలో ఇకపై ప్రైవేటు రంగమే కీలకపాత్ర పోషించనుందని ప్రధాని తెలిపారు. ఆవిష్కరణలు, దీర్ఘకాలిక సామర్థ్యం, అంతర్జాతీయ పోటీని తట్టుకొనే విషయాల్లో ప్రైవేటు రంగ సంస్థలు ధైర్యంగా పెట్టుబడులు పెట్టడంపైనే వికసిత్ భారత్ తర్వాతి దశ ఆధారపడి ఉందని చెప్పారు. వికసిత్ భారత్ ఆవిష్కరణలో మహిళలు కీలకపాత్ర పోషించనున్నారని పేర్కొన్నారు. ‘వచ్చే పదేళ్లలో నిర్మాణాత్మక సంస్కరణలు, శక్తిమంతమైన ఆవిష్కరణలు, పరిపాలనలో మరింత సరళత అనే మూడు లక్ష్యాల సాధనకు ప్రాధాన్యం ఇస్తాం. స్థిరమైన సంస్కరణలు, ప్రైవేటు రంగంలో ధైర్యంగా పెట్టుబడులు పెట్టడం, మౌలిక వసతుల కల్పనను కొనసాగించటం, డిజిటల్ పరివర్తనలపైనే దేశ వృద్ధి ఆధారపడి ఉంది. ప్రాథమిక స్థాయి నుంచి సంస్కరణలు చేపట్టడం వల్లనే నేడు ప్రపంచానికి భారత్ డిజిటల్ లీడర్‌గా ఎదిగింది. డాటా సెంటర్లు యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించగలవు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను మనదేశంలో డాటా సెంటర్లు ఏర్పాటుచేసేందుకు ఆహ్వానిస్తున్నాం. తర్వాతి తరం టెక్నాలజీ విప్లవానికి నాయకత్వం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉంది’ అని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
మా ప్రతి బడ్జెట్ ప్రత్యేకమే..
రాష్ట్ర, జాతీయ స్థాయిలో కలిపి తాను గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వాధినేతగా ఉన్నానని మోదీ గుర్తు చేశారు. ఈ 25 ఏళ్లలో తాము రూపొందించిన ప్రతి బడ్జెట్ దేశాభివృద్ధిలో దేనికదే ప్రత్యేకమైనదని తెలిపారు. ఒక్కటి కూడా సాదాసీదా బడ్జెట్ కాదని పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా స్వల్పకాలిక లక్ష్యాలతో రూపొందించినది కాదని, దేశ దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలను సాధించేందుకు రూపొందించినదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మన రక్షణ రంగాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. అందులో భాగంగానే 2026-27 బడ్జెట్‌లో రక్షణ రంగానికి నిధులు పెంచినట్లు చెప్పారు. కాగా, ప్రధాని ఇంటర్వ్యూపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. చాలా జాగ్రత్తగా రూపొందించిన స్ర్కిప్టు ప్రకారం ఇంటర్వ్యూ సాగిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. ప్రధాని పబ్లిసిటీ స్టంటులో ఇదో భాగమని ఎద్దేవా చేశారు.