Share News

ఏమిటీ ‘నగ్న’ రాజకీయం!

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:45 AM

దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండియా కృత్రిమ మేధ (ఏఐ) ఇంపాక్ట్‌ సదస్సు విజయవంతం కావడం కాంగ్రెస్‌ సహించలేకపోతోందని ప్రధాని మోదీ అన్నారు. యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు కొందరు ఆ సదస్సు వద్ద చొక్కాలు విప్పి హల్‌చల్‌.....

ఏమిటీ ‘నగ్న’ రాజకీయం!

  • ఇప్పటికే నిస్సిగ్గుగా ఉన్నారు.. ఇంకా చొక్కాలు విప్పడమెందుకో?

  • ఏఐ సదస్సు వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తల తీరుపై మీరట్‌ సభలో మోదీ ధ్వజం

మీరట్‌, ఫిబ్రవరి 22: దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండియా కృత్రిమ మేధ (ఏఐ) ఇంపాక్ట్‌ సదస్సు విజయవంతం కావడం కాంగ్రెస్‌ సహించలేకపోతోందని ప్రధాని మోదీ అన్నారు. యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు కొందరు ఆ సదస్సు వద్ద చొక్కాలు విప్పి హల్‌చల్‌ చేయడంపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ మురికి, నగ్న రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆ పార్టీ నిస్సిగ్గుగా మారిందని.. ఇంకా చొక్కాలు విప్పాల్సిన అవసరం ఏముందని ఎద్దేవాచేశారు. ఆదివారం ఆయన యూపీలోని మీరట్‌లో నమో భారత్‌ రైలును, విస్తరించిన మెట్రో రైలును, రూ.12,930 కోట్లతో పూర్తిచేసిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కాంగ్రె్‌సపై విరుచుకుపడ్డారు. ‘ఏఐ సదస్సు వద్ద కాంగ్రెస్‌ నిరసన.. ఆ పురాతన పార్టీ సైద్ధాంతిక దివాలాకోరుతనానికి, పతనానికి నిదర్శనం. సొంత దేశాన్నే అప్రతిష్ఠ పాల్జేస్తోంది. కాంగ్రెస్‌ నేతలు నన్ను ద్వేషిస్తున్నారు. నాకు సమాధి తవ్వాలనుకుంటున్నారు. చివరకు నా తల్లిని అవమానించేందుకూ వెనుకాడడం లేదు. కానీ, ఏఐ సదస్సు బీజేపీ కార్యక్రమం కాదని వారు గుర్తుంచుకోవలసింది. ఇది జాతీయ కార్యక్రమం. కాంగ్రెస్‌ సభ్యత మరచి వ్యవహరించింది. అన్ని హద్దులూ దాటేసింది. వారి ప్రవర్తనను దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనకు సిగ్గుపడాల్సింది పోయి.. దేశాన్ని అవమానించినవారిని హీరోలుగా చిత్రిస్తోంది’ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ కార్యకర్తల తీరును ఖండించిన ప్రతిపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. అవి జాతీయాభిమానం, సత్యం వైపు నిలిచాయని కొనియాడారు. ఒక్క కాంగ్రెస్‌ నేతలు మాత్రమే ఇలాంటి నిరసనకు దిగారని.. దాని మిత్రపక్షాలైన టీఎంసీ, డీఎంకే, బీఎస్పీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వంటి పార్టీలకు ప్రమేయం లేదని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాకు ఓ సూచన చేశారు. ‘ప్రతిపక్షంపై మోదీ విరుచుకుపడ్డారు’ వంటి శీర్షికలు పెట్టొద్దని.. తద్వారా కాంగ్రె్‌సను కాపాడే ప్రయత్నం చేయొద్దని కోరారు.

పార్లమెంటును అడ్డుకుంటున్నారు..

హద్దూ అదుపూలేని, ఉన్మాద కాంగ్రెస్‌ నేతలు దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. ‘ఆ పార్టీ పార్లమెంటును స్తంభింపజేస్తోంది. ఈ నెల మొదటివారంలో లోక్‌సభలో ప్రధాని కుర్చీని కాంగ్రెస్‌ ఎంపీలు చుట్టుముట్టారు. ఆ పార్టీ నేతలు సభలో మాట్లాడరు.. మిత్రపక్షాలనూ మాట్లాడనివ్వడం లేదు. పార్లమెంటును అడ్డుకోవడం వల్ల కాంగ్రెస్‌ మిత్రులే ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు. కాంగ్రెస్‌ ఈ దేశానికి భారంగా మారింది. ప్రధాని కుర్చీలో కూర్చోవాలనుకుంటే మొదట ప్రజల హృదయాలను గెలవాలి. ఆ కుర్చీని ఆక్రమించుకోవడానికి మహిళా ఎంపీలను పంపితే మీరు ప్రధాని కాలేరు’ అని మోదీ ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 23 , 2026 | 01:45 AM