ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముంగిట..ఆర్థిక మండలితో ప్రధాని భేటీ
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:54 AM
పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంపై చర్చించేందుకు తన ఆర్థిక సలహా మండలి (ఈఏసీ)తో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు.
వృద్ధి చర్యలపై విస్తృత చర్చ
న్యూఢిల్లీ, జూన్ 6: పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంపై చర్చించేందుకు తన ఆర్థిక సలహా మండలి (ఈఏసీ)తో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. శనివారం తన నివాసంలో జరిగిన భేటీలో ఆర్థిక వృద్ధి పెంచేందుకు అవసరమైన చర్యలపై విస్తృత స్థాయిలో చర్చించారు. పశ్చిమాసియా సంక్షోభం భారత్‌ను, ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తోందో ఆర్థిక నిపుణులు తమ అంచనాలను వివరించారు. భేటీలో ప్రధాని ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్ కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని ‘ఎక్స్’లో స్పందించారు. ‘భారత ఆర్థిక పరివర్తన, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాధాన్యాలపై కూలంకషంగా చర్చించాం. జీవన సౌలభ్యంతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కొనసాగేలా.. సంస్కరణల ప్రయాణానికి మరింత ఊతమిచ్చేందుకు ఇంకా ఏం చేయాలో పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాం’ అని వివరించారు. ప్రపంచమంతా సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. భారత ఆర్థిక వృద్ధి దృఢంగా ఉందని.. 2026 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 7.7 శాతంగా, చివరి క్వార్టర్‌లో 7.8 శాతంగా ఉంటుందన్న అంచనా.. మన ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతను, సంస్కరణల విజయాలను, 140 కోట్ల మంది భారతీయుల కఠోర శ్రమను ప్రతిఫలింపజేస్తోందని ప్రధాని శుక్రవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈఏసీ ఆర్థికవేత్తలతో కూడిన స్వతంత్ర సంస్థ. ఆర్థిక, తత్సంబంధిత అంశాలపై భారత ప్రభుత్వానికి.. ప్రత్యేకించి ప్రధానికి సలహాలిస్తుంది. ప్రస్తుతం ఈఏసీ చైర్మన్‌గా ఎస్.మహేంద్రదేవ్ ఉన్నారు.