Share News

సవాళ్ల సమయం! ప్రజలంతా ఐక్యంగా ఉండాలి

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:14 AM

పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచం మొత్తం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని.. భారత్‌కు కూడా ఇది సవాళ్ల సమయమేనని ప్రధాని మోదీ తెలిపారు.

సవాళ్ల సమయం! ప్రజలంతా ఐక్యంగా ఉండాలి

  • సంక్షోభంపై రాజకీయాలు చేయొద్దు

  • ‘మన్‌కీ బాత్‌’లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, మార్చి 29(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచం మొత్తం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని.. భారత్‌కు కూడా ఇది సవాళ్ల సమయమేనని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజలంగా చేయి చేయి కలిపి ఐకమత్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్ని రాజకీయం చేయొద్దని విపక్షాలను హెచ్చరించారు. ప్రస్తుత సమయంలో స్వార్థపూరిత రాజకీయాలకు తావులేదన్నారు. ఈ మేరకు ‘మన్‌కీ బాత్‌’ 132వ ఎపిసోడ్‌లో మోదీ స్పష్టం చేశారు. వదంతులను నమ్మవద్దని ఆయన దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వం నిరంతరాయంగా సమాచారం అందిస్తోందని.. దీనిని మాత్రమే ప్రజలు విశ్వసించాలని, దానికి అనుగుణంగానే వ్యవహరించాలని సూచించారు. గతంలో ఏర్పడిన కరోనా వంటి సంక్షోభాల సమయంలో ప్రజలు ఐక్యంగా ఉండి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని.. అదేవిధంగా ఇప్పుడు కూడా వ్యవహరించాలని సూచించారు. కోటి మందికిపైగా భారత పౌరులు గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్నారని ప్రధాని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో వారికి ఆయా దేశాలు అండగా ఉంటున్నాయని.. ఇది చాలా గొప్ప విషయమని అన్నారు. గల్ఫ్‌ దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచ సంక్షోభ సమయంలో కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని మోదీ కేరళలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు. పశ్చిమాసియా యుద్ధంపై ఆ పార్టీ ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తోందని, అలాంటి ప్రకటనలు గల్ఫ్‌ దేశాల్లో ఉంటున్న దాదాపు కోటి మంది భారతీయులను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందన్నారు.

ముదిగుంట ఆదర్శం!

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ముదిగుంట గ్రామం జల సంరక్షణలో దేశానికే ఆదర్శమని మోదీ ప్రశంసించారు. ‘‘ముదిగుంటలో 400 కుటుంబాలు సామూహికంగా ఒక నిర్ణయం తీసుకున్నాయి. తమ ఇళ్లలోనే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నాయి. ఫలితంగా, అక్కడ భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులు తగ్గాయి. ఇది నిజమైన ప్రజా ఉద్యమం.’’ అని మోదీ కొనియాడారు. అలాగే, దేశ యువతను బడ్జెట్‌ రూపకల్పనలో భాగస్వాములను చేసే ‘బడ్జెట్‌ క్వెస్ట్‌’ కార్యక్రమంలో తెలంగాణ యువత ప్రతిభను చాటిందని తెలిపారు. సూర్యాపేటకు చెందిన కోట్ల రఘువీర్‌ రెడ్డి రైతుల సంక్షేమంపై రాసిన వ్యాసం తనను ఆకట్టుకుందని ప్రశంసించారు. యువత ఆలోచనలే దేశ వికాసానికి ఇంధనమని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని కొనియాడారు. వారు కేవలం సముద్రపు యోధులు మాత్రమే కాదని, ఆత్మనిర్భర భారత్‌కు బలమైన పునాదులని అభివర్ణించారు.

Updated Date - Mar 30 , 2026 | 04:14 AM