ఏఐ అందరిది
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:48 AM
ప్రపంచంలో సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని, కృత్రిమ మేధ ప్రయోజనాలు సమాజంలోని ప్రతివర్గానికి చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు...
కృత్రిమ మేధ సాంకేతికత సమాజంలో ప్రతి వర్గానికి చేరాలి: మోదీ
పారిస్, జూన్ 18: ప్రపంచంలో సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని, కృత్రిమ మేధ ప్రయోజనాలు సమాజంలోని ప్రతివర్గానికి చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంత ముఖ్యమో, అందరికీ అందడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. సాంకేతికతలు ప్రజాస్వామీకరణ చెందినప్పుడే అది నిజమైన అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇటీవల ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన రెండు కృత్రిమ మేధ మోడళ్లు ఫేబుల్-5, మైథోస్-5లను ఇతరదేశాల వారికి ఇవ్వకుండా అమెరికా నిషేధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధా న్యం సంతరించుకున్నాయి. గురువారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన వివాటెక్-2026 కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. కృత్రిమ మేధ కేవలం సాంకేతిక పురోగతికి మాత్రమేకాకుండా.. ప్రజల జీవితాలను మెరుగుపర్చేలా, అవకాశాలు, ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా ఉండాలని చెప్పారు. భారత్‌కు ఏఐ అంటే.. ‘అందరికీ అందేది.. అందరినీ కలుపుకొనేది (ఆల్ ఇన్‌క్లూసివ్)’ అని పేర్కొన్నారు. భారత డిజిటల్ రంగ శక్తి ప్రపంచానికే ఆదర్శమని.. ప్రపంచంలోని డిజిటల్ లావాదేవీల్లో సగం ఒక్క భారత్‌లోనే జరుగుతున్నాయని చెప్పారు. కాగా, జీ7 భేటీలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. గురువారం పారిస్‌లో ఆ దేశానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు, కంపెనీల విస్తరణపై చర్చించారు.