Share News

నైపుణ్యం ఉన్నోళ్లకి ఏఐ వల్ల నష్టం లేదు

ABN , Publish Date - Nov 22 , 2026 | 03:15 AM

విశ్వవిద్యాలయాలు ఇచ్చే నర్టిఫికెట్లు పట్టుకొని, సూటూ బూటూ వేసుకొని తిరిగే వారి కంటే అసలైన నైపుణ్యం ఉన్నవారికే భవిష్యత్తులో ప్రాధాన్యం లభిస్తుందని, తన వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోవాలని ప్రధాని మోదీ అన్నారు.

నైపుణ్యం ఉన్నోళ్లకి ఏఐ వల్ల నష్టం లేదు

ఇంటర్నెట్ డెస్క్: విశ్వవిద్యాలయాలు ఇచ్చే నర్టిఫికెట్లు పట్టుకొని, సూటూ బూటూ వేసుకొని తిరిగే వారి కంటే అసలైన నైపుణ్యం ఉన్నవారికే భవిష్యత్తులో ప్రాధాన్యం లభిస్తుందని, తన వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. కృత్రిమ మేధ(ఏఐ) వల్ల ఉద్యోగాలు పోతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతుండడంపై స్పందిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ అంశంలో అనేక చర్చలు జరుగుతున్నాయని, కానీ నైపుణ్యం ఉన్నవారి ఉపాధికి ఢోకా ఉండదనే విషయాన్ని మరువకూడదని మోదీ అన్నారు. పరిస్థితులు మారుతున్నాయని విద్యార్హతలు ఉన్నవారికంటే నైపుణ్యం కలిగిన వ్యక్తులకే గౌరవం, గుర్తింపు లభిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులకు ఆ గుర్తింపు దక్కుతుందని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే 49వ వరల్డ్‌ స్కిల్స్‌ ఆసియా కాంపిటిషన్‌కు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడా ఆతిథ్యమిస్తుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. ఆలోచనా విధానంలో అడ్డంకులను అధిగమించడం ద్వారా భారత్‌ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను శనివారం ఆయన సందర్శించారు. ఆ సంస్థ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొని, ప్రసంగించారు. బిహార్‌లో గంగా నదిపై రూ.4,280 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘నితీశ్‌ సేతు’తో సహా రూ.34 వేల కోట్లకు పైగా విలువైన 227 మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకింతం చేశారు. ఈ సందర్భంగా వైశాలి జిల్లా జఫర్‌పట్టి ప్రాంతంలో శనివారం నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు.

Updated Date - Nov 22 , 2026 | 03:16 AM