Share News

పశ్చిమాసియా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొందాం

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:38 AM

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అధికారులతో 7 బృందాలను ఏర్పాటు చేసినట్టు ప్రధాని మోదీ తెలిపారు.

పశ్చిమాసియా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొందాం

  • గ్యాస్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌, నిల్వలపై రాష్ట్రాలు నిరంతరం నిఘా పెట్టాలి

  • రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రకటన

న్యూఢిల్లీ, మార్చి 24: పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అధికారులతో 7 బృందాలను ఏర్పాటు చేసినట్టు ప్రధాని మోదీ తెలిపారు. చమురు, సరఫరా వ్యవస్థలు, ఎరువులు సహా ఇతర అంశాలపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనేలా ఈ బృందాలు వ్యూహాలు రచిస్తాయన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయాన్ని అవకాశంగా తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామని, గ్యాస్‌ సహా ఇతర ఉత్పత్తుల బ్లాక్‌ మార్కెటింగ్‌, అక్రమ నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో ప్రధాని ప్రకటన చేశారు. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభాన్ని సృష్టించిందన్నారు. ఈ నేపథ్యంలో అవకాశం ఉన్న అన్ని మార్గాల ద్వారా గ్యాస్‌, క్రూడాయిల్‌ వంటివాటిని సమీకరిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియ రాబోయే రోజుల్లోనూ కొనసాగుతుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. పశ్చిమాసియా సంక్షోభం ఓ ప్రత్యేక స్వభావం కలిగి ఉందని ప్రధాని అన్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతికూల పరిస్థితులు చాలా కాలం కొనసాగే అవకాశం ఉందన్నారు.

ఆర్థిక వృద్ధి కొనసాగుతుంది!

సంక్షోభంతో సంబంధం లేకుండా ఆర్థిక వృద్ధి కొనసాగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘పశ్చిమాసియా యుద్ధం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చర్చలు, దౌత్యపరమైన అంశాల ద్వారా ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పాలని భారత్‌ కోరుకుంటోంది. ఈ యుద్ధంతో సంబంధం లేకుండా మన ఆర్థిక వృద్ధి కొనసాగుతుంది.’’ అని మోదీ అన్నారు. యుద్ధాన్ని నిలుపుదల చేసి, హోర్ముజ్‌ జలసంధిని తెరవాలన్నదే మన లక్ష్యమని తెలిపారు. ‘‘సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించడమే మన ప్రయత్నం. ఈ సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవు.’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. కాగా, పశ్చిమాసియా సంక్షోభంపై రాజకీయ పక్షాలతో చర్చించేందుకు కేంద్రం బుధవారం సాయంత్రం 5 గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది.

యుద్ధానికి కరోనాతో పోలికా: రాహుల్‌

పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని ప్రధాని మోదీ కొవిడ్‌-19 నాటి పరిస్థితితో పోల్చడాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. పార్లమెంటు భవనంలో మంగళవారం రాహుల్‌ విలేకరులతో మాట్లాడుతూ భారతదేశ విదేశాంగ విధానం.. ‘మోదీ వ్యక్తిగత విదేశాంగ విధానం’గా మారిపోయిందని విమర్శించారు. ‘‘ట్రంప్‌కు కచ్చితంగా మోదీ ఏం చేస్తారో? ఏం చేయరో? తెలుసు. మోదీ రాజీ పడ్డారంటే, మన విదేశాంగ విధానం రాజీ పడినట్టే. ఇది స్పష్టం. ఎల్పీజీ, పెట్రోల్‌, ఎరువులు..అన్నింటికీ సమస్యలు రానున్నాయి’’ అన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 03:38 AM