Share News

మే 4 తర్వాత నేరగాళ్ల లెక్క తేలుస్తాం!

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:08 AM

పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. మహిళలకు భద్రత కల్పించడంలో ..

మే 4 తర్వాత నేరగాళ్ల లెక్క తేలుస్తాం!

  • గూండాల చేతుల్లో మమత సర్కారు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. మహిళలకు భద్రత కల్పించడంలో ఆమె విఫలమయ్యారని.. టీఎంసీ ప్రభుత్వం సచివాలయం నుంచి నడవడం లేదని.. దానిని గూండాలు, నేరగాళ్లు నడుపుతున్నారని ధ్వజమెత్తారు. మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చాక వాళ్ల లెక్కంతా బయటకు తీస్తామని హెచ్చరించారు. ఆదివారం ఆయన ఎన్నికల సభల్లో ప్రసంగించారు. కీలకమైన మతువా వర్గీయులతోనూ సమావేశమయ్యారు. కోల్‌కతాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. 15 ఏళ్ల కిందట ‘మా (అమ్మ), మాటీ (భూమి), మానుష్‌ (సామాన్యులు)’ అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఎంసీ.. దానిని గాలికొదిలేసిందన్నారు. ‘‘మమత పాలనతో విసిగిపోయిన ప్రతి సోదరి, ప్రతి కుమార్తె ఈ నెల 23న తొలి దశ పోలింగ్‌తో తమ తడాఖా చూపారు. 93 శాతానికిపైగా ఓటింగ్‌తో టీఎంసీ అహంకారాన్ని బద్దలు చేశారు. 29న జరిగే రెండో దశ పోలింగ్‌ తర్వాత బీజేపీ విజయం ఖాయం’’ అని మోదీ అన్నారు. ‘నాకు మీ నెత్తురివ్వండి.. మీకు నేను స్వాతంత్ర్యాన్ని ఇస్తా’ అన్న నేతాజీ నినాదాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీకి ఓటేస్తే.. టీఎంసీ మహాజంగిల్‌రాజ్‌ నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పిస్తానని మోదీ హామీ ఇచ్చారు.

Updated Date - Apr 27 , 2026 | 04:08 AM