పదవులు, పురస్కారాలతో తాయిలాలు!
ABN , Publish Date - Oct 14 , 2026 | 07:09 AM
ఎన్నికల సంఘం(ఈసీ) విశ్వసనీయతపై ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ.. గతంలో వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎండగట్టారు.
కాంగ్రెస్ హయాంలో ఎన్నికల కమిషనర్లకు పదవులు, అవార్డులు
కాంగ్రెస్ తీరుపై గోయల్ ధ్వజం
న్యూఢిల్లీ, అక్టోబరు 13: ఎన్నికల సంఘం(ఈసీ) విశ్వసనీయతపై ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ.. గతంలో వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎండగట్టారు. ఈసీపై విమర్శలు చేసే ముందు ఆ పార్టీ తన గత చరిత్రను పరిశీలించుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నికల సంఘంలో కీలక పదవులు నిర్వహించిన వారికి రాజకీయ అవకాశాలు, ప్రభుత్వ పదవులు, పురస్కారాలు ఇచ్చారని ఆరోపించారు. ఓ మాజీ సీఈసీకి పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా ఇచ్చారని ప్రస్తావించారు. 1990-1996 వరకు సీఈసీగా పనిచేసిన టీఎన్ శేషన్‌కు కాంగ్రెస్ పార్టీ 1999 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఆడ్వాణీ చేతిలో ఓటమి పాలయ్యారు.
గిల్‌కు పద్మ విభూషణ్.. మంత్రి పదవి
మాజీ సీఈసీ ఎంఎస్ గిల్ వ్యవహారంపైనా గోయల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఈసీగా ఉన్న సమయంలోనే గిల్‌కు పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చారని.. అది కాంగ్రెస్ పట్ల ఆయన విధేయతకు దక్కిన ప్రతిఫలమని ఆరోపించారు. అనంతరం గిల్ కాంగ్రె్‌సలో చేరి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో పనిచేసిన వారికి ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాలు కల్పించడం ద్వారా ఎన్నికల సంఘం స్వతంత్రతపై సందేహాలు తలెత్తే పరిస్థితి ఏర్పడిందని గోయల్ పేర్కొన్నారు. మరో మాజీ సీఈసీ ఆర్కే ద్వివేదీకి పదవీ విరమణ చేసిన రెండు నెలలకే గుజరాత్ గవర్నర్ పదవి దక్కిందని గుర్తుచేశారు.
వద్దన్న వ్యక్తినే సీఈసీ చేసిన సోనియా..!
మరో మాజీ సీఈసీ నవీన్ చావ్లా నియామకాన్ని కూడా గోయల్ ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నవీన్ చావ్లాను తొలగించాలని అప్పటి సీఈసీ గోపాలస్వామి సిఫారసు చేస్తే.. నాటి కాంగ్రెస్ సర్కారు ఆయన్ను ఏకంగా సీఈసీని చేసిందని విమర్శించారు. కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రత్నా కేల్కర్ ఉదంతాన్ని సైతం గోయల్ ప్రస్తావించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే అక్కడి సీఎం ఆయన్ను ప్రధాన సలహాదారుగా నియమించారని పేర్కొన్నారు. ప్రస్తుత సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.