Share News

మళ్లీ పెట్రో వడ్డన

ABN , Publish Date - May 24 , 2026 | 04:10 AM

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల భారాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగదారులకు బదిలీ చేస్తుండడంతో..

మళ్లీ పెట్రో వడ్డన

  • పెట్రోల్‌ లీటరుకు 87పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంపు

  • సీఎన్‌జీపైనా కేజీకి రూ.1 పెరిగిన ధర

న్యూఢిల్లీ, మే 23: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల భారాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగదారులకు బదిలీ చేస్తుండడంతో.. శనివారం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు 87 పైసల నుంచి 91 పైసల వరకూ పెరిగాయి. దీంతోపాటు సీఎన్‌జీ ధర కూడా కేజీకి రూ.1 చొప్పున పెరిగింది. ఈ నెల 15న ధరల సవరణ మొదలయ్యాక.. తొమ్మిది రోజుల వ్యవధిలో పెట్రో రేట్లు పెంచడం ఇది మూడోసారి. దీంతో వినియోగదారులపై ఒక్కో లీటరుకు దాదాపు రూ.5 అదనపు భారం పడినట్టయింది. సీఎన్‌జీకి ఒక్కో కిలోపై రూ.4 భారం పడింది. తాజాగా పెరిగిన ధరలు శనివారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.112.84, డీజిల్‌ రూ.100.94కు చేరుకున్నాయి. విజయవాడలో పెట్రోలు ధర లీటరుకు రూ.114.40కి, డీజిల్‌ లీటరుకు రూ.102.13కి చేరుకున్నాయి. కాగా, క్రిసిల్‌ నివేదిక ప్రకారం పెట్రోల్‌ ధరలను రెండోసారి పెంచిన తర్వాత కూడా చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ.10, డీజిల్‌పై లీటరుకు రూ.13 చొప్పున నష్టపోతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ చమురు ధరలు 20శాతం నుంచి 100శాతం మధ్యలో పెరిగాయి. కానీ.. భారత్‌లో మాత్రం అన్నిదేశాల కంటే అత్యల్పంగా పెట్రోల్‌పై లీటరుకు 5 శాతం, డీజిల్‌పై 5.3 శాతం మాత్రమే పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఏపీ, తెలంగాణ, కేరళల్లో వ్యాట్‌ ఎక్కువ: కేంద్రం

అమెరికా-ఇరాన్‌ యుద్ధం మొదలైన తర్వాత పెరుగుతున్న చమురు ధరల ఒత్తిడిని భారత్‌ 76 రోజులపాటు తట్టుకుందని కేంద్రం తెలిపింది. అయినప్పటికీ ఈ సమయంలో పెట్రో ధరల పెంపును లీటరుకు రూ.5కే పరిమితం చేశామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇంత అత్యల్పంగా ధరలు పెంచిన దేశం మనదేనని వెల్లడించింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఎక్కువగా ఉండడానికి ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్‌ కారణమని పేర్కొంది. తాజా ధరల సవరణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.112 దాటిందని కేంద్రం పేర్కొంది. దేశంలో కెల్లా అత్యధిక వ్యాట్‌ను ఈ మూడు రాష్ట్రాలే వసూలు చేస్తున్నాయని, వీటిలో తెలంగాణ, కేరళ.. ఇండియా కూటమికి చెందిన పార్టీల పాలనలో ఉన్నాయని గుర్తుచేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, హరియాణ, గోవా, అసోంలో పెట్రోల్‌ ధరలు రూ.102 కంటే తక్కువగానే ఉన్నాయని చెప్పింది.


ప్రజల సంపద వాయిదా పద్ధతిలో దోపిడీ: ఖర్గే

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రజల సొమ్మును వాయిదాల పద్ధతిలో దోచుకుంటోందని ఆరోపించారు. ఇతర దేశాలు తమ ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంటే..ఇక్కడి బీజేపీ ప్రభుత్వం నిరంతరం దోచుకుంటూనే ఉందని ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘పెట్రోల్‌, డీజిల్‌పై రూ.1000 కోట్ల చొప్పున కేంద్ర పన్నులు వసూలు చేస్తున్నా.. బీజేపీ ఆకలి తీరడంలేదు. అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయలేదు. కానీ... దానికి బదులుగా వారిని నిస్సిగ్గుగా దోచుకుంటోంది’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, భారత్‌లో ఇంధన కొరత లేదని దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) శనివారం తెలిపింది. డిమాండ్‌కు తగినట్టుగా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. పంట కోతల కాలంలో డీజిల్‌ వినియోగం పెరగడం, ప్రైవేటు బంకుల్లో అధిక ధరల కారణంగా వినియోగదారులు ప్రభుత్వ రంగ సంస్థల బంకులకు రావడం వల్ల కొన్ని అవుట్‌లెట్లలో డిమాండ్‌ పెరిగిందని ఐవోసీ పేర్కొంది.

Updated Date - May 24 , 2026 | 04:10 AM