ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:30 AM
ప్రభుత్వ ఉద్యోగం ప్రజల పట్ల బాధ్యతతో కూడిన సేవ అని, ప్రజాసేవకు బద్ధులై వుండడమే ఉద్యోగ విధి అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
20వ రోజ్‌గార్ మేళాలో కేంద్రమంత్రి పెమ్మసాని
చెన్నై, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం ప్రజల పట్ల బాధ్యతతో కూడిన సేవ అని, ప్రజాసేవకు బద్ధులై వుండడమే ఉద్యోగ విధి అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 20వ ‘రోజ్‌గార్’ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తున్నామని, దీంతో ఇప్పటి వరకు రోజ్‌గార్ మేళాల ద్వారా అందించిన మొత్తం నియామకాలు 12 లక్షలు దాటాయని వివరించారు. శనివారం చెన్నైలో జరిగిన 20వ రోజ్‌గార్ మేళాలో పాల్గొన్న ఆయన.. 120 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ముఖ్యమైన విజయమే అయినప్పటికీ, అది ప్రజాసేవకు కొత్త బాధ్యతకు ప్రారంభమని తెలిపారు. తాము ఏ శాఖలో పని చేసినా ప్రజలకు ప్రతి ఉద్యోగి భారత ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటారని చెప్పారు. 2047లో భారత్ స్వాతంత్య్ర శతాబ్ది జరుపుకొనే సమయానికి నేటి యువ ఉద్యోగులే దేశాన్ని నడిపించే బాధ్యతాయుతమైన అధికారులుగా ఎదుగుతారన్నారు. ‘వికసిత్ భారత్’ కేవలం మాటలతో కాదు, ప్రతి ఫైల్, ప్రతి నిర్ణయం, ప్రతి పౌరుడికి అందించే సేవతో నిర్మితమవుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.