3 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతం
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:18 AM
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అసోం, కేరళతోపాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది..
పుదుచ్చేరిలో రికార్డు స్థాయి ఓటింగ్
అసోం, కేరళంల్లోనూ పెరిగిన పోలింగ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అసోం, కేరళతోపాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో 89.87 శాతం ఓటింగ్ నమోదు కాగా, 2021 కంటే ఎక్కువగా అసోంలో 85.64 శాతం పోలింగ్ రికార్డయింది. ఇక కేరళంలో 78.24 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1964లో ఫ్రాన్స్ నుంచి భారత్‌లో విలీనమైన తర్వాత పుదుచ్చేరిలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడం ఇదే ప్రథమం. భానుడి ప్రతాపాన్ని లెక్క చేయక ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కరోనా సమయంలో 2021లో జరిగిన ఎన్నికల్లో అసోంలో 82.04 శాతం పోలింగ్ జరిగితే, ఈ ఎన్నికల్లో 85.65 శాతం గా నమోదైంది. కేరళలో 2021లో 74.06 శాతం ఓటింగ్ రికార్డయితే ఈ దఫా 78.24 శాతానికి చేరుకుంది. కాగా, పుదుచ్చేరిలో భాగమైన కాకినాడ, కోనసీమ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో 94.5 శాతం పోలింగ్ నమోదైంది.