ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకు పవన్ ఖేడా
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:14 AM
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు ఒకటి కన్నా ఎక్కువ పాస్‌పోర్టులు ఉన్నాయన్న తన ఆరోపణలపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం కాంగ్రెస్ నేత...
గువాహటి, ఏప్రిల్ 26: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు ఒకటి కన్నా ఎక్కువ పాస్‌పోర్టులు ఉన్నాయన్న తన ఆరోపణలపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం కాంగ్రెస్ నేత పవన్ ఖేడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు ఆయన బెయిల్ అభ్యర్థనను అస్సాంలోని గువాహటి హైకోర్టు తిరస్కరించింది. రాజకీయ లబ్ధి కోసం అమాయక మహిళను వివాదంలోకి లాగారని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీంతో, ఖేడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, ముందస్తు బెయుల్ మంజూరు సమయంలో పాటించాల్సిన నిబంధనలను సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. నిందితులు పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని కోర్టులు ఆదేశించలేవని ఓ కేసు విచారణ సందర్భంగా తెలిపింది. ఆ అధికారం వాటికి లేదని స్పష్టం చేసింది. ‘‘కావాలంటే కోర్టులు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించవచ్చు. కానీ, వెంటనే వెళ్లి ట్రయల్ కోర్టులో లొంగిపోవాలంటూ వారిని ఆదేశించే అధికారం మాత్రం లేదు’’ అని సుప్రీంకోర్టు తెలిపింది.