డీలిమిటేషన్‌పై మళ్లీ రెఢీ!
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:38 AM
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)-మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింప జేసుకోవడానికి మోదీ సర్కారు వ్యూహాత్మకంగా సిద్ధమైంది.
30 నుంచి పార్లమెంటు సమావేశాలు
‘పునర్విభజన-మహిళా’ బిల్లును ఆమోదించుకునేందుకు మోదీ సర్కారు కసరత్తు
మూడింట రెండొంతుల మెజారిటీ సరిపడా ఎంపీలను కూడగట్టడంపై దృష్టి
ప్రతిపక్షాలకు సమయం చిక్కకుండా.. వేగంగా ‘పని’పూర్తి చేసుకునేలా వ్యూహం
వానాకాల సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు
దీటుగా ఎదుర్కొనేందుకు ఇండి కూటమి సిద్ధం
డిసెంబరు 3 వరకు 4 రోజులు సమావేశాలు
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి
నేటి క్యాబినెట్ భేటీలో ఆమోదముద్ర పడగానే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం
ఢిల్లీ రావడానికి సిద్ధంగా ఉండాలంటూ ఎంపీలకు సమాచారం ఇచ్చిన బీజేపీ?
న్యూఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)-మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింప జేసుకోవడానికి మోదీ సర్కారు వ్యూహాత్మకంగా సిద్ధమైంది. మూడింట రెండొంతుల మెజారిటీకి అవసరమైన ఎంపీల మద్దతు కూడగట్టడంపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఇక వెంటనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. ప్రతిపక్షాలకు సమయం చిక్కకుండా వేగంగా పనిపూర్తి చేసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ నెల 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలను నిర్వహించనుంది. సోమవారం (30న) లోక్‌సభ, డిసెంబరు 2వ తేదీ (బుధవారం)న రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, దీనిపై పార్లమెంటు సమావేశాల నిర్వహణ కోసం లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లకు విజ్ఞప్తి చేశామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం ‘ఎక్స్‌లో వెల్లడించారు. డిసెంబరు 3 వరకు సమావేశాలు జరుగు తాయని తెలిపారు. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు గురువారం రాత్రి ప్రత్యేకంగా బులిటెన్లు విడుదల చేశాయి. ఈ సమావేశాల్లో జీరో అవర్, క్వశ్చన్ అవర్ వంటివేవీ ఉండవని తెలిపాయి. నిజానికి వానాకాల సమావేశాల తర్వాత సభలను ప్రోరోగ్ (నిరవధిక వాయిదా) చేయలేదు.
దీనితో ఇప్పుడు వానాకాల సమావేశాల కొనసాగింపుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక సమావేశాల తర్వాత ప్రోరోగ్ చేసి తర్వాతి వారం, పది రోజుల్లో శీతాకాల సమావేశాలను చేపట్టి.. క్రిస్‌మస్ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్టు తెలిసింది. పార్టీ ఎంపీలంతా వెంటనే ఢిల్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
డీలిమిటేషన్, మహిళా బిల్లుపైనే దృష్టి
ఈ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లును తిరిగి ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకునేందుకు మోదీ సర్కారు రంగం సన్నద్ధం చేసుకుంటోంది. ఏప్రిల్‌లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టినా ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ రాలేదు. ఈ సారి తృణమూల్ నుంచి చీలిన ఎంపీలతోపాటు సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ(పవార్) నుంచి పలువురు ఎంపీలు మద్దతునిచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, 2026(ఎఫ్‌సీఆర్‌ఏ)ను పక్కనపెడితే.. డీలిమిటేషన్-మహిళా బిల్లుకు మద్దతిచ్చేందుకు డీఎంకే సిద్ధంగా ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. అవసరమైతే కొందరు కాంగ్రెస్ ఎంపీల నుంచి క్రాస్ ఓటింగ్ చేయించైనా సరే.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రోరోగ్ చేయకుండా ప్రత్యేక వ్యూహం!
సాధారణంగా పార్లమెంటు సమావేశాలను ముగించినప్పుడు నిరవధిక వాయిదా (ప్రోరోగ్) వేస్తారు. అలా చేయకుంటే సదరు సమావేశాలు ఇంకా ఉనికిలో ఉన్నట్టే లెక్క. అలాంటప్పుడు ఎంపీలకు సమాచారమిచ్చి, వారంలోపే సమావేశాలను తిరిగి ప్రారంభించే వీలుంటుంది. అదే ప్రోరోగ్ చేస్తే కనీసం 2వారాల ముందు సమాచారమివ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు డీలిమిటేషన్-మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వ్యూహాత్మకంగా సిద్ధవుతున్న మోదీ సర్కారు.. అవసరమైన సంఖ్యలో ఎంపీలను కూడగట్టుకుని, ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకే పార్లమెంటు సమావేశాలను ప్రోరోగ్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలకు తగిన సమయం లభించకుండా, వేగంగా పనిపూర్తి చేసుకునే వ్యూహమిదని అంటున్నారు. మరోవైపు మోదీ వ్యూహాలకు దీటుగా స్పందించేందుకు ఇండి కూట మి సిద్ధమవుతోందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.