Share News

రేపట్నుంచీ 3 రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

ABN , Publish Date - Apr 15 , 2026 | 03:49 AM

మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌కు సంబంధించిన బిల్లులను ఆమోదించేందుకు గురువారం నుంచి మూడు రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొనే...

రేపట్నుంచీ 3 రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

  • రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే అందుకు364 మంది సభ్యుల మద్దతు కావాలి

  • ఎన్డీయే కూటమి ఎంపీలు 293 మందే

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌కు సంబంధించిన బిల్లులను ఆమోదించేందుకు గురువారం నుంచి మూడు రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలయ్యేంతవరకూ ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టాలని, 2011 జనగణన ప్రకారం డీలిమిటేషన్‌ చేయకూడదని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో.. ప్రత్యేక సమావేశాలు సవ్యంగా జరిగే పరిస్థితులు కనపడట్లేదు. నియోజకవర్గాల పునర్విభజనకు, మహిళా రిజర్వేషన్‌కూ ముడిపెట్టడంతో.. ఈ రెండింటినీ మోదీ ప్రభుత్వం ఏ విధంగా గట్టెక్కించగలదా అని పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2027 జనగణన తర్వాత డీలిమిటేషన్‌ చేసి, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని తొలుత నిర్ణయించిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు హడావుడిగా 2011 జనగణన ప్రకారమే డీలిమిటేషన్‌ చేసి మహిళా రిజర్వేషన్‌ను 2029 లోక్‌ సభ ఎన్నికలనుంచి అమలుచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. తమకు మహిళా రిజర్వేషన్‌పై అభ్యంతరం లేదని, డీలిమిటేషన్‌ వల్ల మాత్రం రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై సంయుక్త కార్యాచరణకు విపక్షాలన్నింటితో సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈమేరకు.. బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర పార్టీల నేతలు పాల్గొననున్నారు. 2021 జనాభా లెక్కలు పూర్త.యిన తర్వాతే డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టాలని ఇప్పటికే ఆప్‌, ఆర్జేడీ, డీఎంకే పార్టీలు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రతిపక్షాల మద్దతు లేకుండా రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందడం కష్టమని తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ చెప్పారు. రాజ్యాంగ సవరణ ఆమోదం పొందడానికి 364 ఓట్లు అవసరం కాగా ఎన్డీఏకు 293 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. కొన్ని ప్రతిపక్ష పార్టీలను ఒప్పించడానికి, చీల్చడానికి, గైర్హాజరు చేయించడానికి మోదీ శిబిరం తీవ్ర యత్నాలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ, తెలుగుదేశం సహా ఎన్డీఏకి చెందిన అన్ని పార్టీలూ తమ సభ్యులకు విప్‌ జారీ చేశాయి. ఈ పార్టీలకు చెందిన మహిళా నేతలందర్నీ లోక్‌ సభ గ్యాలరీకి రప్పిస్తున్నారు.

Updated Date - Apr 15 , 2026 | 03:49 AM