16 నుంచి మళ్లీ పార్లమెంట్
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:51 AM
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కల్పించే నారీ వందనా అధినియమ్‌ను ప్రవేశపెట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్న మోదీ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు పార్లమెంట్ ఉభయ సభలను ...
మూడు రోజుల పాటు నిర్వహణ
మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం
ఆగమేఘాలపై మహిళా బిల్లు ఎందుకు పెడుతున్నారు: కాంగ్రెస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కల్పించే నారీ వందనా అధినియమ్‌ను ప్రవేశపెట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్న మోదీ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు పార్లమెంట్ ఉభయ సభలను మళ్లీ సమావేశపరచాలని నిర్ణయించింది. గురువారం సాయంత్రం ఉభయ సభలు ప్రోరోగ్ కావడానికి బదులు వాయిదా పడ్డాయి. తాము బడ్జెట్ సమావేశాలనే ప్రస్తుతం వాయిదా వేసి మళ్లీ రెండు మూడు వారాల్లో ప్రారంభించాలనుకుంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు గురువారం తెలిపారు. బడ్జెట్ సమావేశాలను మళ్లీ సమావేశపరుస్తారా అని కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ రాజ్యసభలో అడగడంతో ఆయన ఈ విషయం వెల్లడించారు. కేవలం రాజకీయ కారణాల వల్లే మహిళా బిల్లును ఆగమేఘాలపై ప్రవేశపెడుతున్నారని, ఎన్నికల కోడ్‌కు ఇది విరుద్ధమని జైరాంరమేశ్ వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. 30 నెలలుగా ఈ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదని, జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడతామన్నవారు ఇప్పుడెందుకు ఆ బిల్లును తేవాలనుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు. కాగా ఎన్నికలైన తర్వాత తాము అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ రాసిన విషయం ఖర్గే ప్రస్తావించగా అలా సాధ్యం కాదని కిరెణ్ రిజిజు చెప్పారు. ప్రజలకిచ్చిన వాగ్దానం నెరవేర్చడమే తమ కర్తవ్యమని, దానికీ ఎన్నికలకూ సంబంధం లేదన్నారు. ఈ బిల్లును ఇక ఆలస్యం చేయవద్దని తాము ప్రార్థిస్తున్నామని చెప్పారు. కాగా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ అని ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని బీజేపీ ఎంపీ జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. ఇది అప్రజాస్వామికమని ఖర్గే వ్యాఖ్యానించారు. కాగా మహిళా రిజర్వేషన్‌లో భాగంగా దళితులు, బీసీలకు రిజర్వేషన్ మాటేమిటని ఆర్‌జేడీ ఎంపీ మనోజ్ ఝా ప్రశ్నించారు. లోక్‌సభ సీట్లను 543 నుంచి 816కు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.