Share News

బిల్లులపై ఉత్కంఠ

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:44 AM

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచితుది అంకానికి (చివరి వారానికి) చేరుకున్నాయి. ఈ నెల 13న సమావేశాలు ముగియనున్నాయి.

బిల్లులపై ఉత్కంఠ

  • పార్లమెంటు సమావేశాలు మరో నాలుగు రోజులే

  • ఇంకా పెండింగ్‌లోనే కీలకమైన బిల్లులు

  • ఎఫ్‌సీఆర్‌ఏ, మహిళా కోటా, డీలిమిటేషన్‌ బిల్లులను ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని సర్కారు పట్టుదల

  • మూడేళ్ల క్రితం మాదిరిగా తమను సస్పెండ్‌ చేసి బిల్లులను ఆమోదిస్తారేమోనని విపక్షం అనుమానం

  • సర్కారు వ్యూహాలను సమష్టిగా తిప్పికొడదామన్న ఖర్గే

  • చరిత్ర పునరావృతం కావొద్దు: జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచితుది అంకానికి (చివరి వారానికి) చేరుకున్నాయి. ఈ నెల 13న సమావేశాలు ముగియనున్నాయి. సమావేశాలు ఇంకా నాలుగు రోజులే జరగనుండగా.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కీలక బిల్లులు ఇప్పటికీ ఆమోదం పొందలేదు. వీటిపై ఉత్కంఠ కొనసాగుతోంది. విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు -2026 (ఎఫ్‌సీఆర్‌ఏ)ను ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం వ్యూహాలు సిద్ధం చేసింది. దీనితోపాటే డీలిమిటేషన్‌ (నియోజకవర్గాల పునర్విభజన), మహిళా రిజర్వేషన్‌ బిల్లులను సైతం తెరపైకి తెచ్చే యోచనలో ఉన్నట్లు ప్రతిపక్ష శిబిరంలో జోరుగా చర్చ జరుగుతోంది. 2023 శీతాకాల సమావేశాల మాదిరిగానే విపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసి, ఎలాంటి చర్చ లేకుండానే ఈ కీలక బిల్లులను ఆమోదించుకుంటారనే ఆందోళన ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోంది. ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లును గత మార్చిలో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిని ఈ నెల 12న చర్చకు తెచ్చి, ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ విరాళాలు, ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ రద్దయిన సంస్థల వద్ద ఉన్న ఆస్తుల నియంత్రణ విధివిధానాల్లో ఈ బిల్లు కీలక మార్పులను ప్రతిపాదిస్తోంది.


ఈ ప్రతిపాదనలపై మరింత లోతుగా చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. మరో కీలక బిల్లు వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌ బిల్లు- 2025. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ), ఏఐసీటీఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) స్థానంలో ఒకే ఉన్నత విద్యా నియంత్రణ మండలిని ఏర్పాటు చేసేందుకు దీనిని రూపొందించారు. దీనిని గతేడాది డిసెంబరులో లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. ప్రస్తుతం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనలో ఉంది. ఉభయ సభల్లో లభించే సమయంపై అ బిల్లుపై చర్చ ఆధారపడి ఉంటుంది. అలాగే, ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టు నేషనల్‌ హానర్‌ (అమెండ్‌మెంట్‌) బిల్లు- 2026 ఈ సమావేశాల ఎజెండాలోని ప్రధాన బిల్లుల్లో ఒకటి. జూలై 20న సమావేశాలు ప్రారంభమైనప్పుడు పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ రూపొందించిన తొలి జాబితా ప్రకారం 28 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొన్ని బిల్లులకు ఇప్పటికే ఆమోదం లభించింది.


మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై తర్జన భర్జన

మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ బిల్లులపై ప్రభుత్వం నుంచి అనూహ్య నిర్ణయాలు వెలువడవచ్చనే ప్రచారం జరుగుతోంది. వీటి ఆమోదానికిసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ఈ క్రమంలో ఎక్కువ మంది సభ్యులను వివిధ కారణాలతో సభ నుంచి సస్పెండ్‌ చేసి, ఆ తర్వాత వీటిని ఆమోదిస్తారనే ఆందోళన ప్రతిపక్ష శిబిరంలో కనిపిస్తోంది. అయితే, జెన్‌జీ ఉద్యమం, ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా, మోదీ, అమిత్‌ షా సభకు రాకపోవడం తదితర అంశాల నేపథ్యంలో కేంద్రం అంత సాహసం చేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చివరి నాలుగురోజులు సభ్యులందరూ అప్రమత్తంగా ఉండాలని ఇండియా కూటమి పార్టీలను కాంగ్రెస్‌ హెచ్చరించింది. కాంగ్రెస్‌ సభ్యులంతా సమయానికి విధిగా సభలకు హాజరుకావాలని విప్‌ జారీ చేసింది.


ఉమ్మడి నిర్ణయంతో ముందుకు: ఖర్గే

డీలిమిటేషన్‌ బిల్లును మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో ముడిపెట్టి ప్రభుత్వం తీసుకొస్తే.. ఇండియా కూటమి పార్టీలతో చర్చించి ఉమ్మడి నిర్ణయంతో ముందుకు పోతామని కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి ఈ బిల్లులపై చర్చించాలని ప్రభుత్వాన్ని ఆదివారం డిమాండ్‌ చేశారు. అయితే, బిల్లులపై వ్యక్తిగత అభిప్రాయాలు తెలిపే స్వేచ్ఛ ప్రతిపార్టీకి ఉంటుందని అన్నారు. కాగా, 2023 శీతాకాల సమావేశాల సమయంలో లోక్‌సభ భద్రతా వైఫల్యం, ఆ తర్వాత నెలకొన్న నిరసనల నేపథ్యంలో ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలను (లోక్‌సభలో 100, రాజ్యసభలో 46) సస్పెండ్‌ చేసిన ఉదంతాన్ని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ గుర్తుచేశారు. నాడు ప్రతిపక్షం లేకుండానే కీలకమైన బీఎన్‌ఎ్‌స, బీఎన్‌ఎస్‌ఎ్‌స, బీఎ్‌సఏ బిల్లులతోపాటు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నియామక బిల్లును ఏకపక్షంగా ఆమోదించుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే ఎత్తుగడతో బిల్లులను నెగ్గించుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘2023 డిసెంబరులో తక్కువ మంది విపక్ష సభ్యుల సమక్షంలో కీలక బిల్లులను ఆమోదించుకున్నారు. అలాంటి పరిస్థితి పునరావృతం కారాదు’ అని విపక్ష పార్టీలకు సూచించారు.

Updated Date - Aug 10 , 2026 | 04:45 AM