సీట్ల పెంపుపై గరంగరం!
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:40 AM
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై పార్లమెంటులో వాడీవేడీ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో సీట్ల పెంపు, మహిళలకు 33శాతం...
మహిళా రిజర్వేషన్, డీ లిమిటేషన్ బిల్లులపై దూకుడుగా ముందుకెళ్తున్న ఎన్డీయే ప్రభుత్వం
డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై పార్లమెంటులో వాడీవేడీ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో సీట్ల పెంపు, మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేయగా.. వాటిని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్లలో కూడా ఓబీసీ కోటా ఉండాలని.. 2011 లెక్కల ప్రకారం డీలిమిటేషన్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎస్సీ, ఓబీసీ విభాగాలు గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు సిద్ధమవుతున్నాయి. గురువారం పార్లమెంటులో మూడు బిల్లులను ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మహిళలకు రిజర్వేషన్ కల్పించి, లోక్‌సభ సీట్లను 850కు పెంచేందుకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు.. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన చట్టసభల్లో సీట్లను పెంచడం కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన డీలిమిటేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడుతుండగా.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్లను పెంచేందుకు ఉద్దేశించిన కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టనున్నారు.
ప్రతిపక్షాలను చీల్చేందుకు వ్యూహాలు!
లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మేర ఎన్డీయే ప్రభుత్వానికి బలం లేదు. దీనితో బిల్లుల ఆమోదం కోసం ప్రతిపక్షాన్ని చీల్చేందుకు మోదీ ప్రభుత్వం వ్యూహం పన్నుతోందనే చర్చ జరుగుతోంది. తాము ఇప్పటికే ప్రతిపక్షాలతో మాట్లాడామని, పలు పార్టీలు మద్దతుపై సుముఖత వ్యక్తం చేశాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు తెలిపారు. ప్రధాని మోదీ కూడా పార్లమెంట్‌లో పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖ రాశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌తో బీజేపీ అగ్రనేతలు స్వయంగా మాట్లాడినట్టు సమాచారం. ఇక శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మద్దతు కోసమూ బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఏదోరకంగా ప్రతిపక్షాలను చీల్చి మద్దతు సంపాదించడం.. లేదా కొందరు సభ్యులు గైర్హాజరయ్యేలా చేసి బిల్లుల ఆమోదానికి అవసరమైన ఓట్ల సంఖ్యను తగ్గించడం దిశగా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు.