Central Finance Department: సీజీహెచ్‌ఎస్ లబ్ధిదారులకు ‘పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా’
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:12 AM
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్) లబ్ధిదారుల కోసం ‘పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా’ను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రారంభించింది.
న్యూఢిల్లీ, జనవరి 14 : కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్) లబ్ధిదారుల కోసం ‘పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా’ను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రారంభించింది. టాప్ అప్ స్కీమ్‌గా అందుబాటులోకి తెచ్చిన ఈ బీమాను లబ్ధిదారులు తమ ఇష్టప్రకారం కొనుగోలు చేయవచ్చు. ఈ బీమా పథకం కింద దేశ వ్యాప్తంగా ఇన్‌పేషంట్ ఆస్పత్రి చికిత్సలకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బీమా కవరేజి ఉంటుంది. ఈ పాలసీలో కో-పేమెంట్ విధానం కూడా అందుబాటులో ఉంది. అంటే, బీమా కంపెనీ, లబ్ధిదారు 70:30 లేదా 50:50 శాతం ప్రీమియం వాటాతో పాలసీ తీసుకోవచ్చు. 70:30 వాటాతో పాలసీ తీసుకునే లబ్ధిదారులకు ప్రీమియం సొమ్ములో 28 శాతం, 50 :50 వాటాతో కొనుగోలు చేసే వారికి 42 శాతం రాయితీ లభిస్తుంది. అంతేకాక, క్లెయిమ్‌లు లేకుంటే బీమా మొత్తంపై ఏడాదికి 10 శాతం బోన్‌సగా దక్కుతుంది. ఆస్పత్రిలో చేరడానికి 30 రోజులు ముందు, డిశ్చార్జి తర్వాత 60 రోజులు దాకా కవరేజీ లభిస్తుంది. సీజీహెచ్‌ఎస్ లబ్ధిదారులు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ సంస్థ ద్వారా ఈ బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు.