Share News

కాంగ్రెస్‌ నిరసన నడుమ నత్వానీ నామినేషన్‌కు ఆమోదం

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:11 AM

జార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్‌ నత్వానీ నామినేషన్‌ ఆమోదం పొందింది. ఆయన నామినేషన్‌ చెల్లుతుందని ఎన్నికల ...

కాంగ్రెస్‌ నిరసన నడుమ నత్వానీ నామినేషన్‌కు ఆమోదం

న్యూఢిల్లీ, జూన్‌ 10: జార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్‌ నత్వానీ నామినేషన్‌ ఆమోదం పొందింది. ఆయన నామినేషన్‌ చెల్లుతుందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రంజిత్‌ కుమార్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ లేవనెత్తిన అభ్యంతరాలను తిరస్కరిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నత్వానీ తన నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారాన్ని, అరకొర సమాచారాన్ని పొందుపరిచారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆయన పేరు పరిమళ్‌ నత్వానీ, నత్వానీ పరిమళ్‌ అని వేర్వేరుగా ఉండటాన్ని కూడా కాంగ్రెస్‌ తప్పుబట్టింది. అయితే పేరులో మార్పు సాంకేతికపరమైనదని, దీనివల్ల ఆయన గుర్తింపుపై ఎలాంటి అనుమానం లేదని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి స్పష్టం చేశారు. అఫిడవిట్‌లోని ఖాళీలపై నత్వానీ వివరణ ఇస్తూ సవరించిన పత్రాలను సమర్పించారని, నిబంధనల ప్రకారమే నామినేషన్‌ను ఆమోదించామని తెలిపారు. కాగా, ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ ఇలాంటి డ్రామాలు ఆడుతోందని బీజేపీ విమర్శించింది. నామినేషన్‌ పత్రాల్లో లోపాలను సరిదిద్దుకునేందుకు నత్వానీకి నిబంధనల ప్రకారమే అవకాశం ఇచ్చారని పేర్కొంది. జార్ఖండ్‌లో రెండు రాజ్యసభ స్థానాలకు 18న ఎన్నికలు జరుగుతాయి. జేఎంఎం నుంచి బైద్యనాథ్‌ రామ్‌, కాంగ్రెస్‌ నుంచి ప్రణబ్‌ ఝా నామినేషన్లు వేశారు. మూడో అభ్యర్థిగా పరిమళ్‌ నత్వానీ బరిలో ఉన్నారు. అయితే ఇండి కూటమి ఎమ్మెల్యేల నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగితేనే నత్వానీ గెలుపు సాధ్యపడుతుంది.

Updated Date - Jun 11 , 2026 | 04:11 AM