వాహనాల కొనుగోలుకు పాన్ తప్పనిసరి!
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:35 AM
ఇకపై రూ.5 లక్షలకన్నా ఖరీదైన వాహనాలను కొన్నప్పుడు పాన్‌ను వెల్లడించాల్సి ఉంటుంది. అది బైకు, స్కూటరు వంటి ద్విచక్ర వాహనమైనా వర్తిస్తుంది.
రూ.5 లక్షల కంటే ఖరీదైన వాటికి వర్తింపు
ఐటీ నిబంధనల్లో మార్పులతో ముసాయిదా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఇకపై రూ.5 లక్షలకన్నా ఖరీదైన వాహనాలను కొన్నప్పుడు పాన్‌ను వెల్లడించాల్సి ఉంటుంది. అది బైకు, స్కూటరు వంటి ద్విచక్ర వాహనమైనా వర్తిస్తుంది. ప్రస్తుతం ఎంత ఖరీదు బైకు కొనుగోలు చేసినా పాన్‌ను వెల్లడించాల్సిన అవసరం లేదు. కార్లు వంటి ఇతర వాహనాలకు మాత్రం ధరతో సంబంధం లేకుండా పాన్ తప్పనిసరి. ఆదాయం పన్ను కొత్త నిబంధనలతో ఈ పరిస్థితి మారనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ఆదాయం పన్ను నిబంధనలు, 1962’లలో సవరణలు చేస్తూ కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ‘ఆదాయం పన్ను చట్టం, 2025’ తీసుకురానుంది. దీనిపై తుది కసరత్తులో భాగంగా ఆదాయం పన్ను ముసాయిదా నిబంధనల్లో పలు సవరణలు జరిపారు. వీటిని మార్చి తొలివారంలో నోటిఫై చేసే అవకాశం ఉంది. దీంతో, పాన్ వెల్లడించాల్సిన లావాదేవీల పరిమితి గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలో ఒకసారి రూ.50 వేలకన్నా ఎక్కువ మొత్తం జమ చేస్తే.. జమ చేసే వ్యక్తి తన పాన్‌ను తెలియజేయటం తప్పనిసరి. ఇక మీదట ఒక వ్యక్తి ఖాతా లేదా పలు ఖాతాల నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు, అంతకుమించి జమ చేసినప్పుడు లేదా విత్‌డ్రా చేసుకున్నప్పుడు మాత్రమే పాన్‌ను తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లలో ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు.. బిల్లు రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ ఉంటే పాన్ తప్పనిసరి. ఇకపై బిల్లు రూ.లక్ష దాటితేనే పాన్ తెలియజేయాల్సి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం, బదిలీల్లో ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల పరిమితి ఇక మీదట రూ.20లక్షలకు పెరగనుంది. ముసాయిదా నిబంధనల ప్రకారం..హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌లను కూడా ఇకపై క్యాటగిరీ 1 మెట్రోపాలిటిన్ నగరాలుగా పరిగణిస్తారు. తద్వారా ఈ నగరాల్లో నివసించే ఉద్యోగులు హెచ్‌ఆర్‌ఏ అలవెన్సు పెరుగుతుంది.