బంగాళాఖాతంపై మళ్లీ పాక్ కన్ను
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:36 AM
బంగ్లాదేశ్ అవతరణతో 1971 తర్వాత బంగాళాఖాతంలో ఉనికిని కోల్పోయిన పాకిస్థాన్.. తాజాగా ఆ దేశంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో..
1971 తర్వాత మళ్లీ అక్కడ ఉనికి చాటుకునే యత్నాలు
న్యూఢిల్లీ, జూన్ 18: బంగ్లాదేశ్ అవతరణతో 1971 తర్వాత బంగాళాఖాతంలో ఉనికిని కోల్పోయిన పాకిస్థాన్.. తాజాగా ఆ దేశంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మళ్లీ అక్కడ తన ఉనికిని చాటుకునేందుకు సిద్ధమైంది. చైనా నిర్మించిన అత్యంత అధునాతన జలాంతర్గామి అయిన ‘పీఎన్‌ఎ్‌స హంగోర్’ను సముద్రమార్గంలో పాకిస్థాన్‌కు తీసుకెళ్తూ దారిలో కొలంబో పోర్టు వద్ద ఆగినప్పుడు పాక్ కమోడోర్ ఒమర్ ఫారూక్ ఈ మేరకు సంకేతాలిచ్చారు. ‘‘హంగోర్ క్లాస్ జలాంతర్గాములతో మా నౌకాదళ సామర్థ్యం అరేబియా సముద్రం అవతలికి కూడా విస్తరిస్తుంది. ఇవి మా సైనిక శక్తిని బంగాళాఖాతంలో కూడా ప్రదర్శించడానికి ఒక గొప్ప అవకాశాన్నిస్తాయి. ఇవి ఆటను పూర్తిగా మార్చేసే (గేమ్‌చేంజర్) జలాంతర్గాములు’’ అని ఆయన పేర్కొన్నారు. చైనా నుంచి పాకిస్థాన్ మొత్తం 8 హంగోర్ జలాంతర్గాముల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జలాంతర్గాములకు ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ)’ సామర్థ్యం ఉంది. దీనివల్ల ఇవి సాధారణ డీజిల్ ఎలక్ట్రిక్‌జలాంతర్గాములతో పోలిస్తే ఎక్కువకాలం.. అంటే కొన్నివారాలపాటు నీటిలోనే ఉండిపోగలవు.