Share News

నా జీవితకాల పరిశోధనలకు గుర్తింపు

ABN , Publish Date - Jan 26 , 2026 | 04:26 AM

తన జీవిత కాల పరిశోధనలకు గుర్తింపుగానే పద్మశ్రీ పురస్కారం దక్కినట్టు భావిస్తున్నానని.. సీసీఎంబీ శాస్త్రవేత్త కె. తంగరాజ్‌ అన్నారు. తమిళనాడు తన సొంత రాష్ట్రమే అయినప్పటికీ, హైదరాబాద్‌లో 32 ఏళ్లగా ఉంటున్నానని.....

నా జీవితకాల పరిశోధనలకు గుర్తింపు

  • తమిళనాడు సొంత రాష్ట్రమే అయినా.. 32 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే!

హైదరాబాద్‌ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తన జీవిత కాల పరిశోధనలకు గుర్తింపుగానే పద్మశ్రీ పురస్కారం దక్కినట్టు భావిస్తున్నానని.. సీసీఎంబీ శాస్త్రవేత్త కె. తంగరాజ్‌ అన్నారు. తమిళనాడు తన సొంత రాష్ట్రమే అయినప్పటికీ, హైదరాబాద్‌లో 32 ఏళ్లగా ఉంటున్నానని.. తన పరిశోధనలలో 100ు హైదరాబాద్‌, సీసీఎంబీలు కీలక పాత్ర పోషించాయని ఆయన పేర్కొన్నారు. 1993లో సీసీఎంబీలో సైంటిస్ట్‌‘బి’గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆధునిక మానవ మూలాలు, కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు, ఇన్‌ఫెర్టిలిటీ, ఫోరెన్సిక్‌ జెనిటిక్స్‌, ఆయుర్‌ జినోమిక్స్‌, మైటోకాండ్రియల్‌ డిజార్డర్స్‌ వంటి మాలిక్యులర్‌ ఆధారిత వ్యాధులపై విశేష పరిశోధనలు చేశారు. రాష్ట్రీయ రతన్‌ అవార్డుతో సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఆయనకు కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనతో ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అందులో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు..

నేను చేసిన పరిశోధనలలో.. జనాభా చరిత్ర, అంతర్వివాహాల వల్ల కలుగుతున్న ఆరోగ్య సమస్యలు, ఆ వ్యాధులు తరువాత తరానికి వ్యాప్తి చెందకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివి చాలా ముఖ్యమైనవి. మా పరిశోధనలు ప్రధానంగా మానవ మూలాలు, ఆరోగ్యం, వ్యాధులు అనే అంశాల చుట్టూనే ఉంటాయి. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యాననే విషయం తెలిసిన వెంటనే చాలా ఆనందం కలిగింది. ప్రభుత్వం నా పనిని గుర్తించి, ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందించడంతో కలిగిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. భారతీయ జనాభా చాలా ఆసక్తికరమైనది, వినూత్నమైనది. ఇక్కడ 4635కు పైగా గ్రూప్‌లతో విస్తృత వైవిధ్యం కనబడుతుంది. ఇండియాలో ప్రతి జనాభా సమూహంలోనూ నిర్దిష్టమైన జన్యుపరమైన వ్యాధులు ఉండే అవకాశాలున్నాయని మా పరిశోధనల్లో గుర్తించాము. మన భారతీయుల జన్యువులలో వస్తున్న ఉత్పరివర్తనల కారణంగానే మనకు కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. ఏ జన్యువు ఉత్పరివర్తనం చెందిందో తెలుసుకోవడం ద్వారా.. ఎవరెవరికి ఆ వ్యాధులు వచ్చే అవకాశం ఉందో చెప్పవచ్చు. తద్వారా వారు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

భారత జన్యు చరిత్రను మలుపు తిప్పిన శాస్త్రవేత్త.. డా.తంగరాజ్‌

భారతీయ జనాభా ఉద్భవం, జన్యు వైవిధ్యం, వ్యాధులపై అవగాహనను విప్లవాత్మకంగా మార్చిన శాస్త్రవేత్తగా డాక్టర్‌ తంగరాజ్‌కు గొప్ప పేరుంది. జనాభా జన్యుశాస్త్రం (పాపులేషన్‌ జీనోమిక్స్‌), వైద్య జన్యుశాస్త్రం (మెడికల్‌ జీనోమిక్స్‌) రంగాల్లో ఆయన చేసిన పరిశోధనలు భారత ప్రజల మూలాలు, పరస్పర సంబంధాలు, వ్యాధుల జన్యు నేపథ్యాన్ని లోతుగా అర్థం చేసుకునేలా చేశాయి. భారతీయ జనాభాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు డాక్టర్‌ తంగరాజ్‌ పరిశోధనలు కీలక సమాధానాలను అందించాయి. అండమాన్‌ దీవులలోని గిరిజన సమూహాలు ఆఫ్రికా నుంచి వేల సంవత్సరాల క్రితం బయటకు వలస వచ్చిన తొలి ఆధునిక మానవులని ఆయన తన జన్యువిశ్లేషణల ద్వారా నిర్ధారించారు. మానవ వలస చరిత్రను స్పష్టంగా వివరించిన ఈ విశేష పరిశోధన 2005లో ప్రతిష్ఠాత్మక నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

Updated Date - Jan 26 , 2026 | 04:26 AM