Share News

అ సామాన్యులకు పద్మశ్రీ

ABN , Publish Date - Jan 26 , 2026 | 04:06 AM

పేరు, ప్రచారం కోసం కాకుండా సమాజానికి ఏదైనా చేయాలనే ఆశతో తమ జీవితాన్ని త్యాగం చేసిన సామాన్యుల కృషిని కేంద్రం గుర్తించింది. విద్య, వైద్యం, వ్యవసాయం, సమాజసేవ, కళలు ఇలా తాము ఎంపిక చేసుకున్న రంగంలో అసామాన్య కృషి చేస్తున్న 54 మంది సామాన్యులను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.

అ సామాన్యులకు పద్మశ్రీ

  • సమాజాన్ని జాగృతం చేసిన 54 మంది సామాన్యులకు కేంద్రం గుర్తింపు

న్యూఢిల్లీ, జనవరి 25: పేరు, ప్రచారం కోసం కాకుండా సమాజానికి ఏదైనా చేయాలనే ఆశతో తమ జీవితాన్ని త్యాగం చేసిన సామాన్యుల కృషిని కేంద్రం గుర్తించింది. విద్య, వైద్యం, వ్యవసాయం, సమాజసేవ, కళలు ఇలా తాము ఎంపిక చేసుకున్న రంగంలో అసామాన్య కృషి చేస్తున్న 54 మంది సామాన్యులను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇందులో ఛత్తీ్‌సగఢ్‌లోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసిన బుద్రి తాటి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న మహారాష్ట్రకు చెందిన రఘువీర్‌ తుకారామ్‌ ఖేడ్కర్‌ ఉన్నారు. అలాగే, 88 ఏళ్ల వయస్సులో పారిశుధ్యం, పరిసరాల పరిసరాల పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న మాజీ ఐపీఎస్‌ అధికారి ఇంద్రజీత్‌ సంధును కూడా కేంద్రం పద్మశ్రీకి ఎంపిక చేసింది. హైదరాబాద్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్‌, అవయ దానానికి సంబంధించిన డొనేట్‌ లైఫ్‌ సంస్థ వ్యవస్థాపకులు గుజరాత్‌కు చెందిన నీలేశ్‌ వినోద్‌చంద్ర మండేవాలా కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు. వీరితోపాటు బుండేలి యుద్ధకళ శిక్షకుడైన మధ్యప్రదేశ్‌కు చెందిన భగవాన్‌దాస్‌ రాయికర్‌, సిలంబం యుద్ధ క్రీడను అభివృద్ధి చేసిన పుదుచ్చేరికి చెందిన పజనీవేల్‌ కూడా జాబితాలో ఉన్నారు. అలాగే, హిందీ ప్రచారం కోసం 60ఏళ్లకు పైగా శ్రమిస్తున్న సీనియర్‌ జర్నలిస్టు కైలాష్‌ చంద్రపంత్‌, కశ్మీరీ సాహితీవేత్త షఫీ షౌక్‌, త్రిపురకు చెందిన కోక్‌బరక్‌ భాషను ప్రచారం చేస్తున్న నరేశ్‌ దేబ్‌బర్మ కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇత్తడిని చెక్కి వివిధ ఆకృతులను రూపొందించడంలో నిపుణులైన చిరంజీ లాల్‌ యాదవ్‌(యూపీ), కాంస్య కళా శిల్పి రాజస్తపతి కలియప్ప గౌండర్‌(తమిళనాడు), జమ్దానీ నేత విధానంపై వేలాది నేత కార్మికులకు శిక్షణనిచ్చిన హరియాణాకు చెందిన ఖేమ్‌ రాజ్‌ సుంద్రియాల్‌ సేవలను కూడా ప్రభుత్వం గుర్తించింది. సుమంగళి సేవా ఆశ్రమ్‌ ద్వారా మహిళా సాధికారతతోపాటు చిన్నారుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కర్ణాటకకు చెందిన ఎస్జీ సుశీలమ్మ, మహిళలకు కాంతా ఎంబ్రాయిడరీపై శిక్షణనిస్తోన్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన త్రిప్తి ముఖర్జీ సేవలను కూడా గుర్తించింది.

7.jpg

ఉచిత గ్రంథాలయం

కర్ణాటకకు చెందిన అంకె గౌడ(75) ఒకప్పుడు బస్‌ కండక్టర్‌గా పని చేసేవారు. 20 భాషలకు చెందిన 20 లక్షలకు పైగా పుస్తకాలతో ‘పుస్తక్‌ మానె’ అనే పేరుతో ఆయన ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత అరుదైన మను లిపికి చెందిన పుస్తకాలను కూడా సేకరించి తన గ్రంథాలయంలో పెట్టి అందరికీ ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రజలు పుస్తక పఠనం వైపు దృష్టి పెట్టేలా ఆయన చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది.


6.jpg

ఆసియాలోనే తొలి తల్లిపాల బ్యాంక్‌

ముంబైకి చెందిన పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్‌ అర్మిడ ఫెర్నాండేజ్‌.. శిశు మరణాలను తగ్గించేందుకు, తల్లి పాల కొరత సమస్యను పరిష్కరించేందుకు ఆసియాలోనే తొలిసారిగా ఓ తల్లిపాల బ్యాంకును ఏర్పాటు చేశారు. ఆమె చేసిన ఈ కృషికి ప్రతిగా ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది.

1.jpg

సంగీతం, నాట్యం, జానపదం..

నట సంకీర్తన కళాకారుడైన మణిపూర్‌కు చెందిన యుమ్నాం జాత్ర సింగ్‌(100), బిహార్‌కు చెందిన జానపద నాట్యకారుడు విశ్వబంధు, రాజస్థానీ జానపద కళాకారుడు గఫ్రుద్దీన్‌ మెవాటీ జోగీ, గుజరాత్‌ సంప్రదాయ సంగీత కళా రూపకం మన్‌భట్‌ కళాకారుడు దార్మిక్‌లాల్‌ చునిలాల్‌ పాండ్యా, తమిళనాడుకు చెందిన భజన పాటల గాయకులు ఒత్వూరు తిరుత్తుణి స్వామినాథన్‌, కబ్రీ జానపదం, ఆధునిక సంగీత రంగంలో విశేష కృషి చేస్తున్న అసోంకు చెందిన పోకిల లెక్తిపి, ఢోలక్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన గుజరాత్‌కు చెందిన మిర్‌ హజ్‌భాయ్‌ కసమ్‌భాయ్‌కు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది.

4.jpg

వైద్య రంగంలో సేవకులు

పురాతన టిబిటెయిన్‌ వైద్యానికి ప్రాచుర్యం కల్పిస్తున్న లద్ధాఖ్‌కు చెందిన పద్మా గుర్మీత్‌, బ్లాక్‌ ఫీవర్‌ నిర్ధారణకు అతి తక్కువ ఖర్చుతో చేసే పరీక్షను అభివృద్ధి చేసిన శ్యామ్‌ సుందర్‌(ఉత్తరప్రదేశ్‌), వారసత్వంగా వచ్చే రక్త రుగ్మత అయిన హీమోఫిలియా రంగంలో చేసిన విశేష కృషికి గాను సీనియర్‌ హెమటాలజిస్ట్‌ సురేశ్‌ హంగావడి(కర్ణాటక)ను గుర్తించిన కేంద్రం వారికి పద్మశ్రీ ప్రకటించింది. బస్తర్‌ గ్రామీణ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టు కింద గిరిజనుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేసిన రామచంద్ర గోడ్‌బోలే, సునీత గోడ్‌బోలేలు కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు. అలాగే, పురాతన ఔషధాలు, ఆధునిక వైద్య విధానాలతో పశువైద్యం చేస్తోన్న తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్త పుణ్యమూర్తి నటేశన్‌కు కూడా కేంద్ర గుర్తింపు లభించింది.


3.jpg

పర్యావరణం, వ్యవసాయం

పత్తి సాగుకు సంబంధించి దాదా లడ్‌ అనే విధానాన్ని అభివృద్ధి చేసిన వ్యవసాయ రంగ ఆవిష్కర్త మహారాష్ట్రకు చెందిన షిరిరంగ్‌ దేబ్‌ లాడ్‌, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేసేందుకు పలు ఆవిష్కరణలు చేసిన యూపీకి చెందిన రఘుపత్‌ సింగ్‌, పశు సంరక్షణ, పాడి పరిశ్రమలో సహకార స్ఫూర్తితో ప్రగతి సాధించేందుకు కృషి చేసిన తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి (మరణానంతరం) కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు. కేరళకు చెందిన 92 ఏళ్ల పర్యాణవరణ వేత్త కొల్లక్కయల్‌ దేవకీ అమ్మ, సంప్రదాయ పద్ధతుల్లో అడవుల పెంపకానికి విశేష కృషి చేసిన మేఘాలయకు చెందిన హోలీ వార్‌, నీటి నిల్వ, సద్వినియోగానికి సంబంధించి చెక్‌ డ్యామ్‌లు, గట్లు, వంటి నిర్మాణాలను 75,000కు పైగా నిర్మించిన మధ్యప్రదేశ్‌కు చెందిన మోహన్‌ నగార్‌ కృషికి కూడా కేంద్ర గుర్తింపు లభించింది. వీరితోపాటు మరికొందరు సామాన్యులను కూడా కేంద్రం పద్మశ్రీకి ఎంపిక చేసింది.

5.jpg

గిరిజన భాషలు, కళలు సంస్కృతి

వెదురు, సొరకాయతో తయారుచేసిన తార్పా అనే గిరిజన సంగీత పరికరం తార్పాను వాయిం చే మధ్యప్రదేశ్‌కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు భిక్‌ల్యా లదక్య దిండా, అంతరిచిపోతున్న అల్గోజా అనే వాయిద్య పరికర సంగీత కళాకారుడు తాగారామ్‌ భీల్‌ కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు. కాగా, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఒడిసా, అసోం రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్‌, నేపాల్‌లో ఉండే సంతాల్‌ తెగ వారు సంతాళి భాష మాట్లాడుతుంటారు. ఈ సంతాళి భాష పుస్తక రచయిత, స్వర కర్త చరణ్‌ హెంబ్రామ్‌(ఒడిసా) కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు. నీలగిరి ప్రాంతంలో శతాబ్ధాల చరిత్ర కలిగిన కురుంబ అనే గిరిజన చిత్రలేఖన కళకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆర్‌ కృష్ణన్‌(తమిళనాడు), అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన పురాతన నిషి తెగ సంస్కృతి రక్షణకు పని చేస్తున్న ఆ రాష్ట్రానికి చెందిన నిషీ గుబిన్‌, గిరిజనుల మాటలను రికార్డింగ్‌ చేసి వాటిని సంరక్షిస్తున్న ఒడిసాకు చెందిన మహేంద్ర కుమార్‌ మిశ్రా కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు.

Updated Date - Jan 26 , 2026 | 04:06 AM