Share News

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:37 AM

రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన...

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం

  • ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, నటుడు మమ్ముట్టిలకు పద్మభూషణ్‌

  • తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారం

  • అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పద్మ అవార్డులను అందజేశారు. 2026 సంవత్సరానికిగాను 131 మందికి పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించగా, మే 25న తొలి విడతలో 66 మందికి పురస్కారాలను అందజేసిన సంగతి తెలిసిందే. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ప్రధాని నరేంద్రమోదీ, స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, కింజారపు రామ్మోహన్‌నాయుడు తదితర ప్రముఖుల సమక్షంలో మంగళవారం రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో భాగంగా.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్‌, మలయాళ జర్నలిస్టు పీ నారాయణన్‌లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్‌ పురస్కారాలను ప్రదానం చేశారు. మలయాళ నటుడు మమ్ముట్టి, క్యాన్సర్‌ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, ప్లేబ్యాక్‌ సింగర్‌ ఆల్కా యాజ్ఞిక్‌తో పాటు మరో ముగ్గురు పద్మభూషణ్‌ అవార్డులను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అందుకున్న వారిలో మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌, చంద్రమౌళి గడ్డమణుగు, కుమారస్వామి తంగరాజ్‌, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, రామారెడ్డి మామిడి (మరణానంతరం) ఉన్నారు. రెండో విడతలో మొత్తం 65మందికి అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో ఇద్దరికి పద్మ విభూషణ్‌, ఆరుగురికి పద్మభూషణ్‌, 57 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. తాజాగా పద్మశ్రీ అందుకున్నవారిలో నటుడు మాధవన్‌, క్రికెటర్‌ రోహిత్‌ శర్మ ఉన్నారు.

4.jpg1.jpg2.jpg

Updated Date - Jun 24 , 2026 | 04:37 AM