ప్యాకేజ్డ్ ఫుడ్‌పైనా హెచ్చరిక లేబుళ్లు ఉండాలి
ABN , Publish Date - May 24 , 2026 | 04:11 AM
ఇంట్లో పిల్లలు మారాం చేసినప్పుడు బిస్కెట్లు, చిప్స్ వంటి చిరుతిళ్ల ప్యాకెట్లు వారి చేతిలో పెడుతుంటారు. మరి, ఆ ప్యాకెట్లు కొనుగోలు చేసేటప్పుడు వాటి వెనుక ఉండే పోషక విలువల పట్టికను ఎప్పుడైనా క్షుణ్నంగా...
ప్యాకెట్ ముందుభాగంలో స్పష్టంగా కనిపించేలా పెద్ద అక్షరాలతో ముద్రించాలి
ఆరోగ్య నిపుణుల డిమాండ్
న్యూఢిల్లీ, మే 23: ఇంట్లో పిల్లలు మారాం చేసినప్పుడు బిస్కెట్లు, చిప్స్ వంటి చిరుతిళ్ల ప్యాకెట్లు వారి చేతిలో పెడుతుంటారు. మరి, ఆ ప్యాకెట్లు కొనుగోలు చేసేటప్పుడు వాటి వెనుక ఉండే పోషక విలువల పట్టికను ఎప్పుడైనా క్షుణ్నంగా పరిశీలించారా? ప్యాకెట్లపై చిన్నచిన్న అక్షరాలతో.. కనిపించీ, కనిపించకుండా.. చదవడానికి వీలుకాని విధంగా ముద్రించి ఉండటంతో ఈ పట్టికను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. వైద్యులు, పోషకాహార నిపుణులు, వినియోగదారుల సంఘాల మద్దతుతో ప్యాకేజ్డ్ ఫుడ్‌పై స్పష్టమైన హెచ్చరికలతో కూడిన లేబుళ్లు ముద్రించే వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాటిన్ అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాల్లో ఆహార ఉత్పత్తులపై ఇటువంటి హెచ్చరికలు ఇప్పటికే ముద్రిస్తున్నారు. అయితే భారత్‌లో మాత్రం ఈ దిశగా ఇంకా అడుగు పడాల్సి ఉంది.
పిల్లలు కూడా గుర్తించేలా...
భారత్‌లో కూడా ఆ తరహా నిబంధనలు వస్తే ప్యాకెట్ ముందు భాగంలోనే ‘హై ఇన్ షుగర్’, ‘హై ఇన్ సోడియం’ అని పెద్ద అక్షరాలతో లేదా ఆకర్షణీయమైన గుర్తులతో ముద్రిస్తారు. ఈ హెచ్చరిక లేబుళ్ల ద్వారా వినియోగదారులు తాము కొనుగోలు చేసే ఆహారంలో ఉన్న కొవ్వులు, చక్కెర శాతాన్ని సులభంగా గుర్తించవచ్చు. తద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని వారు ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తాము కొనుగోలు చేసే ఆహారం ఆరోగ్యకరమైనదా, కాదా అనే విషయాన్ని చిన్న పిల్లలు సైతం గుర్తించగలిగేలా ఈ హెచ్చరిక లేబుళ్లు ఉండాలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్, మెక్సికో, చిలీ, పెరూ తదితర దేశాల్లో ఈ హెచ్చరిక లేబుళ్ల కారణంగానే అధిక చక్కెర కలిగిన ఉత్పత్తుల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయని, అక్కడి వినియోగదారుల్లో దీనిపై అవగాహన పెరిగిందని వివరిస్తున్నారు.