Share News

‘ప్యాకేజ్డ్‌ ఆహారం’పై హెచ్చరిక సంకేతాలేవి?

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:24 AM

ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాల్లో అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు స్థాయులను స్పష్టంగా సూచించే ‘ఫ్రంట్‌- ఆఫ్‌- ప్యాక్‌ వార్నింగ్‌ లేబుల్స్‌’ (ఎఫ్‌వోపీఎల్‌)ను తప్పనిసరి చేయడంలో..

‘ప్యాకేజ్డ్‌ ఆహారం’పై హెచ్చరిక సంకేతాలేవి?

  • ఎఫ్‌ఎస్ఎస్ఏఐపై సుప్రీం కోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాల్లో అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు స్థాయులను స్పష్టంగా సూచించే ‘ఫ్రంట్‌- ఆఫ్‌- ప్యాక్‌ వార్నింగ్‌ లేబుల్స్‌’ (ఎఫ్‌వోపీఎల్‌)ను తప్పనిసరి చేయడంలో జరుగుతున్న జాప్యంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ)ను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. ఈ నిబంధనలను మొదటి నుంచే ఎందుకు తప్పనిసరి చేయలేదని ప్రశ్నించింది. గురువారం జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. లేబుల్స్‌ అమలుకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ కోరుతున్న ‘సహేతుకమైన సమయం’ అంటే ఏమిటో వివరించాలని, అలాగే దీన్ని రెండు దశల్లో ఎందుకు అమలు చేయాలని సూచించారో చెప్పాలని నిలదీసింది. పాఠశాల పిల్లలు, కౌమార దశలో ఉన్న వారిలో ఊబకాయం పెరుగుతోందంటూ హెచ్చరించిన యూనిసెఫ్‌ నివేదికను ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. పాఠ్యాంశాల్లో ‘పోషకాహార విద్య’ను చేర్చే అంశంపై 10 రోజుల్లోగా స్పందించాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అలాగే, ప్రమాదకరమైన ఆహారాన్ని సూచించేందుకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ప్రతిపాదించిన ‘ఎర్రటి షడ్భుజి’ ఆకారంపై కూడా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది మాంసాహారాన్ని సూచించే లేబుల్‌ను పోలి ఉండడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను సెప్టెంబరు 28కి వాయిదా వేసింది.

Updated Date - Sep 12 , 2026 | 06:28 AM