పునర్విభజన పేరుతో కుట్ర: చిదంబరం
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:08 AM
నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్రంలోని బీజేపీ పాలకులు కుట్ర పన్నుతున్నారని, ఈ విషయాన్ని తానెప్పుడో చెప్పానని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు.
చెన్నై, మార్చి 15(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్రంలోని బీజేపీ పాలకులు కుట్ర పన్నుతున్నారని, ఈ విషయాన్ని తానెప్పుడో చెప్పానని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. బుధవారం ఆయన కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడారు. పునర్విభజన ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాల గొంతును అణచివేస్తుందని, వాటి రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 16 నుంచి 19 వరకూ జరగనున్న పార్లమెంట్ సమావేశాలను ముందస్తు ప్రణాళిక ప్రకారం వేసిన కుట్రగా అభివర్ణించారు. పునర్విభజన బిల్లు ఎలాంటి ఆంటంకం లేకుండా ఆమోదం పొందాలనే ఉద్దేశంతోనే ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే వచ్చే ప్రమాదం ఏమిటని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఇప్పటికే దక్షిణాదిపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్న కేంద్రంలోని పాలకులు ఈ పునర్విభజనను అమలు చేస్తే ఈ రాష్ట్రాలు మరింతగా నష్టపోవడం ఖాయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రతిపక్షాల ఎంపీలు సభకు రారనే ఉద్దేశంతోనే గురువారం పునర్విభజన ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారని ఆరోపించారు. ఇండియా కూటమి ఎంపీలంతా పునర్విభజన బిల్లును ఏకగ్రీవంగా వ్యతిరేకించాలని చిదంబరం విజ్ఞప్తి చేశారు.