దశాబ్ద కాలంలో మూతపడ్డ బడులు.. 93 వేలు
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:28 AM
తగినంత మంది విద్యార్థులు లేక దేశవ్యాప్తంగా గత పదేళ్ల కాలంలో 93వేలకుపైగా పాఠశాలలు మూతపడ్డాయి. మూతపడిన పాఠశాలలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్....
పిల్లలు లేని పాఠశాలలు తెలంగాణలో ఎక్కువే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తగినంత మంది విద్యార్థులు లేక దేశవ్యాప్తంగా గత పదేళ్ల కాలంలో 93వేలకుపైగా పాఠశాలలు మూతపడ్డాయి. మూతపడిన పాఠశాలలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు అగ్రభాగాన ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరి లోక్‌సభలో వెల్లడించారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని బడులు అధికంగా మూతపడ్డాయి. ప్రజల వలసలతోపాటు, హేతుబద్ధీకరణ కింద పాఠశాలలను విలీనం చేయడం కూడా ఇందుకు కారణం. కొన్ని చోట్ల పాఠశాలలు కొనసాగుతున్నా వాటిలో విద్యార్థుల లేనేలేరు. ఇలాంటి ‘జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్ల’లో 70 శాతం తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ల్లోనే ఉండడం గమనార్హం. 2024-25లో తెలంగాణలోని 2,245 బడులు, పశ్చిమ బెంగాల్‌లో 3,812 పాఠశాలలు విద్యార్థులు లేకుండానే నడుస్తున్నాయి. పాఠశాలలు మూతపడినప్పటికీ విద్యార్థులు చదువులకు దూరం కాలేదని, వారు వేరే చోట చదువుతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విద్యావేత్తలు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు.