140కి పైగా విమానాల రద్దు
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:09 AM
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో విమానాల రద్దు కొనసాగుతోంది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా విమానాశ్రయాల్లో...
న్యూఢిల్లీ/ముంబై, మార్చి 6: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో విమానాల రద్దు కొనసాగుతోంది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా విమానాశ్రయాల్లో 142 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబై విమానాశ్రయంలో అత్యధికంగా 73 సర్వీసులు నిలిచిపోగా, బెంగళూరులో 33, ఢిల్లీలో 29, కోల్‌కతాలో 7 విమాన సర్వీసులు రద్దయ్యాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం పలు విమానయాన సంస్థలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి. స్పైస్‌జెట్ సంస్థ యూఏఈలో చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకొచ్చేందుకు 14 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్‌ప్రెస్ సంస్థలు జెడ్డా, మస్కట్ సర్వీసులను పునరుద్ధరించాయి. ఆకాశ ఎయిర్ సంస్థ కూడా జెడ్డాకు పరిమిత సర్వీసులను కొనసాగిస్తోంది. శనివారం ముంబై, అహ్మదాబాద్, కొచ్చి నుంచి జెడ్డాకు సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. కాగా, ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ సంస్థలు ప్రత్యేక విమానాలను ప్రకటించాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల నుంచి అహ్మదాబాద్‌కు అదనపు సర్వీసులను నడపనుంది. అటు ఆకాశ ఎయిర్ సంస్థ ఆది, సోమ వారాల్లో ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక విమానాలను నడపనున్నట్లు వెల్లడించింది.