Share News

తల, కళ్లే రిమోట్‌..

ABN , Publish Date - May 31 , 2026 | 05:01 AM

ప్రమాదంలోనో, అనారోగ్యం కారణంగానో కాళ్లు, చేతులు చచ్చుబడిపోయిన, వీల్‌చైర్‌కే పరిమితమైన వారి బాధ వర్ణనాతీతం.. 24 గంటలూ ఎవరో ఒకరి సాయం లేకుండా ఏమీ చేసుకోలేని దుస్థితి..

తల, కళ్లే రిమోట్‌..

  • వీల్‌చైర్‌ నుంచే నియంత్రణ.. తల కదిలిస్తే వీల్‌చైర్‌ కదులుతుంది

  • ఓయూ యువ ఇంజనీర్ల ఆవిష్కరణ

  • ‘హెడ్‌ జెష్చర్‌ ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ వీల్‌చైర్‌’ను అభివృద్ధి చేసిన హారిక, జయదీప్‌

ఉస్మానియా యూనివర్సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రమాదంలోనో, అనారోగ్యం కారణంగానో కాళ్లు, చేతులు చచ్చుబడిపోయిన, వీల్‌చైర్‌కే పరిమితమైన వారి బాధ వర్ణనాతీతం.. 24 గంటలూ ఎవరో ఒకరి సాయం లేకుండా ఏమీ చేసుకోలేని దుస్థితి.. కానీ అలాంటి వారు ఇకపై కేవలం తల, కళ్ల కదకలికలు, ముఖంలో హావాభావాలతోనే.. కావాల్సినట్టుగా వీల్‌చైర్‌ను కదిలించగలరు. ఇంట్లోని ఫ్యాన్లు, టీవీలు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను కావాల్సినట్టుగా పనిచేయించుకోగలరు. తమ అవసరాలను పలు భాషల్లో వినిపించగలరు. ఇందుకు వీలు కల్పించే ప్రత్యేక వీల్‌చైర్‌ను ఉస్మానియా వర్సిటీ బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు హారిక, జయదీప్‌ అభివృద్ధి చేశారు. దీనికి ‘హెడ్‌ జెష్చర్‌ ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ వీల్‌చైర్‌’గా పేరుపెట్టారు.

కెమెరా, ప్రత్యేక ప్రాసెసింగ్‌ యూనిట్‌తో..

స్మార్ట్‌ వీల్‌చైర్‌లో ‘రాస్ప్‌బెర్రీ పై ప్రాసెసింగ్‌ యూనిట్‌’ను అమర్చారు. దానికి కెమెరా, స్ర్కీన్‌ మాడ్యూల్‌ను అనుసంధానం చేశారు. ఇది వీల్‌చైర్‌లోని వారికి అభిముఖంగా ఉండి.. నిరంతరం వారి తల, కళ్ల కదలికలను పరిశీలిస్తూ ఉంటుంది. ‘మీడియాపైప్‌, పైథాన్‌ ఆధారిత ఇమేజ్‌ ప్రాసెసింగ్‌’ ప్రోగ్రామ్‌ల సహాయంతో కదలికలను విశ్లేషించి, ఆదేశాలుగా మారుస్తుంది. ఎడమవైపు తల తిప్పితే వీల్‌చైర్‌ ఎడమవైపు, కుడివైపు తిప్పితే కుడివైపు, పైకి అంటే ముందుకు కదిలేలా వ్యవస్థ పనిచేస్తుంది. స్ర్కీన్‌ మాడ్యూల్‌లోని ఏదైనా అంశంపై దృష్టి నిలిపితే.. దాన్ని కమాండ్‌గా పరిగణించే ‘డ్వెల్‌ బేస్డ్‌ సెలెక్షన్‌’ విధానాన్ని కూడా ఇందులో ఉపయోగించారు. అంటే మనం ఫోన్‌లో కావాల్సిన యాప్‌ను చేత్తో ట్యాప్‌ చేసినట్టుగా.. స్ర్కీన్‌ మాడ్యుల్‌లోని కావాల్సిన అంశంపై కాసేపు దృష్టిసారిస్తే అది ఓపెన్‌ అవుతుందన్నమాట. వీల్‌ చైర్‌లోని వ్యవస్థను హోమ్‌ ఆటోమేషన్‌ మాడ్యూల్‌కు అనుసంధిస్తారు. వీల్‌చైర్‌లోని వ్యక్తి స్ర్కీన్‌ మాడ్యూల్‌లోని ఫ్యాన్‌ను ఆన్‌ చేసే ఆప్షన్‌పై దృష్టిసారిస్తే.. ప్రాసెసింగ్‌ యూనిట్‌ దీనిని విశ్లేషించి, హోమ్‌ ఆటోమేషన్‌ మాడ్యూల్‌కు పంపుతుంది. అది ఫ్యాన్‌ను ఆన్‌ చేస్తుంది. ఇలా లైట్లు, టీవీలు, ఇతర పరికరాలను ఆన్‌, ఆఫ్‌ చేయడం వంటివన్నీ తల, కళ్ల కదలికలతోనే చేసుకోవచ్చు. మాట్లాడలేని లేదా స్పష్టంగా కమ్యూనికేట్‌ చేయలేని వారి కోసం ప్రత్యేక ‘టెక్స్ట్‌-టు-స్పీచ్‌’ ఫీచర్‌ను కూడా జోడించారు. ఇది తెలుగు సహా పలు భారతీయ భాషల్లో, ఇంగ్లి్‌షలో వినియోగదారుడి అవసరాలను వాయిస్‌ రూపంలో వినిపించగలదు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే కుటుంబ సభ్యులకు, సంరక్షకులను వెంటనే అలర్ట్‌ చేసే సదుపాయాన్నీ కల్పించారు. తీవ్ర శారీరక వైకల్యాలతో బాధపడుతున్న వ్యక్తుల జీవితానికి ఈ స్మార్ట్‌ వీల్‌చైర్‌ కొత్త దిశ చూపుతుందని వర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ పి.చంద్రశేఖర్‌ చెప్పారు.


తక్కువ ఖర్చుతోనే చాలా ఫీచర్లు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అసిస్టివ్‌ టెక్నాలజీలు చాలా ఖరీదైనవి. చాలా వాటి పనితీరు ఒకట్రెండు పనులకే పరిమితం. ఈ క్రమంలోనే వీల్‌చైర్‌ నియంత్రణ, కమ్యూనికేషన్‌, హోమ్‌ ఆటోమేషన్‌ అన్నింటినీ ఒకే ప్లాట్‌ఫాంపై అందించేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించాం. ఇళ్లలో, పునరావాస కేంద్రాల్లో, వృద్ధాశ్రమాల్లో ఈ వ్యవస్థను సులభంగా వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఐ-ట్రాకింగ్‌, అడ్డంకుల గుర్తింపు, అడాప్టివ్‌ ఇంటెలిజెంట్‌ కంట్రోల్‌ వ్యవస్థలను జోడించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం.

- హారిక, జయదీప్‌

Updated Date - May 31 , 2026 | 05:01 AM