ఒరాకిల్ ఊచకోత
ABN , Publish Date - Apr 01 , 2026 | 03:54 AM
అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ మంగళవారం ఒకేసారి 30 వేల మంది ఉద్యోగులపై వేటేసింది. అందులో ఏకంగా 12 వేల మంది భారతదేశంలో....
30 వేల మంది ఉద్యోగులపై వేటు
భారత్‌లోనే 12 వేల మంది తొలగింపు
మంగళవారం పొద్దున్నే అందరికీ మూకుమ్మడి మెయిల్
మరిన్ని తొలగింపులు ఉంటాయన్న వార్తలతో ఉద్యోగుల్లో ఆందోళన
ముగిసిన త్రైమాసికంలో భారీగా లాభాలు
ఏఐలో పెట్టుబడుల కోసం కోతలకు దిగిన అమెరికా టెక్ కంపెనీ
న్యూఢిల్లీ, మార్చి 31: అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ మంగళవారం ఒకేసారి 30 వేల మంది ఉద్యోగులపై వేటేసింది. అందులో ఏకంగా 12 వేల మంది భారతదేశంలో పని చేస్తున్న ఉద్యోగులే. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో సహా పలు దేశాల్లో పనిచేస్తున్న 1.62 లక్షల మంది ఒరాకిల్ సిబ్బందిలో 18 శాతం మందిని తీసేస్తున్నట్లు సమాచారం. అమెరికా, కెనడాల్లో తొలగించిన ఉద్యోగుల్లోనూ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్లు సమాచారం. మేనేజింగ్ హోదాల్లో ఉన్న వాళ్లే ఎక్కువ మంది వేటుకు గురయినట్లు చెబుతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఆరు గంటలకు వేల మంది సిబ్బందికి ఒకేసారి తొలగింపు ఉత్తర్వులు ఈమెయిల్ ద్వారా వెళ్లాయి. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వారి రోల్స్ అవసరం లేదని తేలడంతో పూర్తిగా ఎత్తేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 31 వారి చివరి పనిదినమని చెప్పారు. కంపెనీ ల్యాప్‌టా్‌పలకు యాక్సెస్ కూడా నిలిపేశారు. ఉదయం నిద్ర లేవగానే బాంబులా వచ్చి పడిన వార్తతో మొత్తం టెక్ ప్రపంచంలో సంచలనం నెలకొంది. ఒరాకిల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోతగా భావిస్తున్నారు. ఒరాకిల్ ఇండియాలో 30,000 మంది పని చేస్తున్నారు. మరో విడత కోతలు ఉంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏ చేదు వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.
లాభాలు వచ్చినా...
ఒరాకిల్ కూడా ఏఐ డేటా సెంటర్ రంగంలోకి ప్రవేశించింది. 156 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందుకోసం ఇప్పటికే 50 బిలియన్ డాలర్లు అప్పు తెచ్చింది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకొనే కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాల్లో కోతలు పెడుతోంది. దీంతో వెంటనే పది బిలియన్ డాలర్ల నగదు అందుబాటులోకి వస్తుందని అంచనా. నిజానికి ఒరాకిల్ నష్టాల్లో ఏమీ లేదు. దాని లాభాలు ముగిసిన త్రైమాసికంలో గత ఏడాదితో పోలిస్తే 95 శాతం పెరిగి, 6.13 బిలియన్ డాలర్లకు చేరాయి. పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదిరాయి. అంతా పచ్చగా ఉందనుకుంటున్న తరుణంలో భారీ కోత నిర్ణయం తీసుకున్నారు.
పరిహారం
తీసేసిన ఉద్యోగులకు ముగిసిన నెల జీతంతో పాటు మరో మూడు నెలల జీతం ఇస్తారు. ఇప్పటివరకు కంపెనీలో సర్వీసును లెక్కగట్టి ఏడాదికి 15 రోజుల జీతాన్ని అదనంగా ఇస్తారు. వీటికి తోడు మార్చి 31 తేదీ వరకు మిగిలిఉన్న అన్ని సెలవులను నగదు చేసుకోవడానికి అనుమతిస్తారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా గ్రాట్యుటీ చెల్లిస్తారు. కంపెనీ నిర్దేశించిన గడువులోగా రాజీనామా చేసిన వారికే ఇవన్నీ వర్తిస్తాయి.