స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం!
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:40 AM
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.
నేడు నోటీసు ఇవ్వనున్న ప్రతిపక్షాలు.. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు
రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఇందుకు మంగళవారం నోటీసు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్పీ), ఆర్‌ఎస్పీ తదితర పార్టీల నేతలు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 103 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ తీర్మానం ప్రవేశపెట్టి, చర్చకు అనుమతించేందుకు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని, ఒక వేళ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా ఉంటే మార్చి 9 తర్వాత జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి. 8 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకూ బహిష్కరించడం, మహిళా ఎంపీల గురించి ప్రస్తావించడం, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకపోవడంతో పాటు అదే సమయంలో కాంగ్రె్‌సకు, గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా రచించిన పుస్తకాలను ఉటంకిస్తూ మాట్లాడేందుకు బీజేపీ సభ్యుడు నిశికాంత దుబేను అనుమతించడం గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. నిబంధనల ప్రకారం నోటీసు అందిన 14 రోజుల తర్వాత స్పీకర్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు తేదీని నిర్ణయిస్తారు. సభకు హాజరైన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ రాజీనామా చేయవలసి ఉంటుంది. లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులు ఉండగా, ఇండియా కూటమికి 234 మంది సభ్యుల బలం ఉంది. చైనాతో ఘర్షణ సమయంలో దేశ రాజకీయ నాయకత్వం తమకు దిశా నిర్దేశం చేయలేదని భారత ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె తన పుస్తకంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకించేందుకు స్పీకర్ ఓం బిర్లా రాహుల్ గాంధీని అనుమతించకపోవడంతో అధికార పార్టీకి, ప్రతిపక్షాలకు మధ్య గత 8 రోజులుగా ఘర్షణ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, లోక్‌సభ సోమవారం కూడా గందరగోళం నడుమ వాయిదా పడిన తర్వాత రాహుల్ గాంధీ, మరికొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు స్పీకర్‌ను కలిశారు.
కొద్ది నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పార్లమెంటులో తాను లేవనెత్తాలనుకుంటున్న అంశాలను రాహుల్.. స్పీకర్‌కు తెలిపినట్లు సమాచారం. సభలో తనను మాట్లాడేందుకు అనుమతిస్తే చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారని తెలిసింది. ఈ విషయంపై అధికార పక్షంతో మాట్లాడిన తర్వాత మళ్లీ ప్రతిపక్ష నాయకులను కలుస్తానని స్పీకర్ చెప్పినట్లు సమాచారం. కాగా, వాణిజ్య మంత్రి గోయెల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతుండగా.. గోయల్ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వివరాలను సభలో కాకుండా ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారని శివ పేర్కొన్నారు. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు.
సామాజిక మాధ్యమాల్లో నరవాణే పుస్తకం
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పుస్తకం ప్రచురణకు సంబంధిత అధికారుల నుంచి ఇంకా అనుమతులు రాలేదని ఆ కారణంగా కేసు పెట్టినట్టు సోమవారం అధికారులు తెలిపారు.