బకాసుర పార్టీ.. బీజేపీ!
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:07 AM
ఒక్క రోజులో ఏకంగా ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి పలు విపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి...
ఎంత తిన్నా ఆకలి తీరదు
అన్ని పార్టీల్లో ఉన్న చెత్త అంతా బీజేపీలోకి : శివసేన (ఉద్ధవ్)
మోదీ వాషింగ్ పౌడర్.. బీజేపీ వాషింగ్ మెషిన్: కాంగ్రెస్
ముంబై, న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఒక్క రోజులో ఏకంగా ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి పలు విపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. శివసేన (ఉద్ధవ్‌థాకరే) నేత సంజయ్‌రౌత్.. బీజేపీని బకాసురునితో పోల్చారు. మహాభారతంలో బకాసురుడనే రాక్షసుడికిఎంత తిన్నా తీరనంత ఆకలి ఉంటుందని, ప్రస్తుతం బీజేపీ కూడా అలాగే తయారైందన్నారు. బీజేపీకిలోకి ఫిరాయించిన ఏడుగురు ఆప్ ఎంపీలు పేజ్ 3 నాయకులని (మీడియాలో కనిపించే సెలబ్రిటీలు), ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకునేందుకే వాళ్లు పార్టీ మారారని ఆరోపించారు. అన్ని పార్టీల్లో ఉన్న చెత్త అంతా ఈ విధంగా బీజేపీలోకి వెళ్లిపోవటమే మంచిదని, దీంతో బీజేపీ డంపింగ్‌యార్డుగా మారుతుందన్నారు. బీజేపీలోకి ఫిరాయించిన ఆప్ ఎంపీ రాఘవ్‌చద్దా.. ఒకప్పుడు బీజేపీని గూండాలపార్టీగా అభివర్ణించారని గుర్తు చేశారు. చద్దాతోపాటు పార్టీ మారిన మరో ఆప్ ఎంపీ, లౌలీ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ మిత్తల్‌పై ఈడీ దాడులు జరిగిన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ రాజకీయాలు ఎంత సిగ్గుమాలినవో అందరికీ తెలుసన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత్‌ను నరకంతో పోల్చిన విషయాన్ని పేర్కొంటూ.. నరకం అంటే ఎలా ఉంటుందో బీజేపీ చూపిస్తోందని రౌత్ విమర్శించారు. తన ను కూడా మనీల్యాండరింగ్ పేరుతో ఓ తప్పుడు కేసులో ఇరికించి, బీజేపీలోకి రావాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని, జైలుకు వెళ్లటానికైనా సిద్ధమేగానీ.. పార్టీకి ద్రోహం చేయనని చెప్పానని రౌత్ పేర్కొన్నారు. 2022లో రౌత్ సదరు కేసులో అరెస్టై జైలుపాలైన సంగతి తెలిసిందే. ఇండియా కూటమికి చెందిన మరో పార్టీ డీఎంకే కూడా ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించింది. భారతదేశంలోనే అత్యంత నీచమైన రాజకీయ పార్టీ బీజేపీ అని డీఎంకే అధికార ప్రతినిధి ఇళన్ గోవన్ పేర్కొన్నారు. ‘అధికారంలోకి రావటానికి వాళ్లు ఎలాంటి తప్పుడు పనులకైనా, రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకైనా పాల్పడుతారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. పలు రాష్ట్రాల్లో బీజేపీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు చెందినవారేనని విషయం దీనిని నిరూపిస్తోంది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘మోదీ వాషింగ్ పౌడర్‌తో బీజేపీ వాషింగ్ మెషిన్ మళ్లీ వచ్చింది. సిద్ధాంతం, నైతికత అని కబుర్లు చెప్పేవారి అసలు స్వరూపం బట్టబయలైంది’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరుతామని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ శనివారం పునరుద్ఘాటించారు.