Share News

కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ రాజీనామాకు విపక్షాల పట్టు

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:44 AM

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో కేంద్రమంత్రి హర్దీ్‌పసింగ్‌ పురీ పేరు ఉన్న నేపథ్యంలో ఆయన తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు శుక్రవారం కూడా పార్లమెంటులో హంగామా సృష్టించాయి.

కేంద్ర మంత్రి  హర్దీప్‌సింగ్‌ పురీ రాజీనామాకు విపక్షాల పట్టు

  • ముగిసిన బడ్జెట్‌ తొలి విడత సమావేశాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో కేంద్రమంత్రి హర్దీ్‌పసింగ్‌ పురీ పేరు ఉన్న నేపథ్యంలో ఆయన తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు శుక్రవారం కూడా పార్లమెంటులో హంగామా సృష్టించాయి. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం తదితర అంశాలపైనా నిరసన వ్యక్తంచేశాయి. దరిమిలా పార్లమెంటు ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. దీంతో తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభమైన మొదటి విడత సమావేశాలు.. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్‌పై పూర్తి స్థాయి చర్చ జరుగకుండానే అత్యంత గందరగోళ పరిస్థితుల్లో ముగియడం గమనార్హం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ నెల 2న లోక్‌సభలో మాట్లాడుతూ.. 2020 నాటి లద్దాఖ్‌ సంక్షోభంపై ఆర్మీ మాజీ చీఫ్‌ నరవణె రాసిన అప్రచురిత పుస్తకంలోని అంశాలను చదివేందుకు ప్రయత్నించగా.. అధికార పక్షం అడ్డుకుంది. సభ కార్యకలాపాలు స్తంభించాయి. లోక్‌సభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ప్రసంగించకుండానే రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో మాత్రం ప్రధాని ప్రసంగించారు. ఆ తర్వాత భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడం.. ప్రధానితో ఫోన్లో చర్చించిన దరిమిలా.. ఈ ఒప్పందం దేశ రైతులకు వ్యతిరేకమని.. మోదీ భారతమాతను అమ్మేశారని రాహుల్‌ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మలివిడత బడ్జెట్‌ సమావేశాలు మార్చి 9న ప్రారంభం అవుతాయి.

Updated Date - Feb 14 , 2026 | 01:44 AM