Share News

సీఈసీ జ్ఞానేశ్‌ ఉద్వాసనకు ప్రతిపక్షాల తీర్మానం?

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:59 AM

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు త్వరలో పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టనున్నాయి.

సీఈసీ జ్ఞానేశ్‌ ఉద్వాసనకు ప్రతిపక్షాల తీర్మానం?

న్యూఢిల్లీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు త్వరలో పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టనున్నాయి. ఈ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు రూపొందించిన తీర్మానం ముసాయిదాకు కాంగ్రెస్‌ పార్టీతో పాటు పలు ఇండియా కూటమి పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. సుప్రీంకోర్టు జడ్జి లేదా హైకోర్టు జడ్జిని తొలగించేందుకు ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానం మాదిరే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించేందుకు కూడా తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ తీర్మాణంపై లోక్‌సభ నుంచి కనీసం వంద మంది, రాజ్యసభ నుంచి కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలని నిర్ణయించాయని, తాము ఇప్పటికే సంతకాలు సేకరించడం ప్రారంభించామని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ ఒకరు తెలిపారు. బెంగాల్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ ప్రవేశపెట్టి లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించేందుకు పూనుకుంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఆ పదవికి అనర్హుడని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ అంశంపై సుప్రీంకోర్టులో స్వయంగా వాదించడమే కాక నిరవధిక ధర్నాను నిర్వహిస్తున్నారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించేందుకు తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు ఆమె గతవారం తెలిపారు.

Updated Date - Mar 10 , 2026 | 04:59 AM