Share News

సీఈసీ జ్ఞానేశ్‌పై పార్లమెంటులో అభిశంసన నోటీసులు

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:38 AM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన నోటీసులను ప్రతిపక్షాలు శుక్రవారం పార్లమెంటు ...

సీఈసీ జ్ఞానేశ్‌పై పార్లమెంటులో అభిశంసన నోటీసులు

న్యూఢిల్లీ, మార్చి 13: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన నోటీసులను ప్రతిపక్షాలు శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టాయి. ఈ నోటీసులపై 130 మంది లోక్‌సభ, 63 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసినట్లు సమాచారం. జ్ఞానేశ్‌కుమార్‌ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడంతో పాటు మరో ఆరు అభియోగాలను మోపాయి. ముఖ్యంగా ఇటీవల బిహార్‌ సహా పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నాయి. టీఎంసీ ప్రవేశపెట్టిన ఈ నోటీసులపై విపక్ష ఇండియా కూటమీలోని పార్టీలతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. భారత చరిత్రలో ఓ ప్రధాన ఎన్నికల కమిషర్‌పై అభిశంసన నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324(5) ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే విధానం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంతో సమానంగా ఉంటుంది. అభిశంసన నోటీసులు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కనీసం లోక్‌సభలో 100మంది, రాజ్యసభలో 50సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ నోటీసులను పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. దాన్ని ఆమోదించాలంటే సభలోని మొత్తం సభ్యుల్లో మెజారిటీతో పాటు, హాజరైన సభ్యుల్లో మూడింట రెండోంతుల మెజారిటీ అవసరం.

Updated Date - Mar 14 , 2026 | 04:38 AM