సీఈసీపై విపక్షాల నోటీసుల తిరస్కరణ
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:33 AM
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు సమర్పించిన తీర్మానాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు సమర్పించిన తీర్మానాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సోమవారం తిరస్కరించారు. ఎన్నికల ప్రక్రియలో సీఈసీ పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్నారని, ఎన్నికల అక్రమాల విచారణలను అడ్డుకుంటున్నారని, ఓటర్ల జాబితా నుంచి అధిక సంఖ్యలో పేర్ల తొలగింపునకు కారణమవుతున్నారని పేర్కొంటూ మార్చి 12న విపక్ష సభ్యులు ఈ నోటీసులు ఇచ్చారు. రాజ్యసభలో 63 మంది, లోక్‌సభలో 130 మంది సభ్యులు సంతకాలు చేసిన ఈ నోటీసులను పరిశీలించిన సచివాలయాలు, వీటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘గతంలో విపక్ష ఎంపీలు ఇచ్చిన పిటిషన్‌ను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్‌కు ఏమైందో మాకు తెలుసు’’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతేడాది అనారోగ్య కారణాలతో రాజీనామా చేసిన మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఉదంతాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.