ఇక సీఈసీ వంతు!
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:06 AM
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు.. ఇప్పుడు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్....
జ్ఞానేశ్‌కుమార్ తొలగింపునకు నేడు విపక్షాల నోటీసు
న్యూఢిల్లీ, మార్చి 12: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు.. ఇప్పుడు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించేందుకు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించిన తీర్మానం నోటీసుపై 130 మంది లోక్‌సభ, 63 మంది రాజ్యసభ ఎంపీలు (మొత్తం 193 మంది) సంతకాలు చేశారు. దీనిని శుక్రవారం పార్లమెంటుకు సమర్పించే అవకాశముంది. ఏ సభలో ముందు ప్రవేశపెడతారో స్పష్టత లేదు. భారత పార్లమెంటు చరిత్రలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను తొలగించడానికి నోటీసివ్వడం ఇదే ప్రథమం. వాస్తవానికి సీఈసీని పదవి నుంచి తొలగించడం కుదరదు. ఒకవేళ తొలగించాలంటే.. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే అభిశంసన ప్రక్రియనే చేపట్టాల్సి ఉంటుంది. పార్లమెంటు ఉభయసభల్లో మొదట ఏదైనా సభలో సదరు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. సభలోని మొత్తం సభ్యుల్లో మెజారిటీ ఎంపీల ఆమోదం పొందాలి. లేదంటే ఆరోజు సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతులమంది తీర్మానాన్ని ఆమోదించాలి.