‘పశ్చిమాసియా’పై చర్చకు విపక్షాల పట్టు
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:03 AM
పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు సోమవారం లోక్‌సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దీంతో స్పీకర్ ఓం......
చర్చకు రాని అభిశంసన తీర్మానం
న్యూఢిల్లీ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు సోమవారం లోక్‌సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లాపై అభిశంసన తీర్మానంపై చర్చ నిర్వహించలేకపోయారు. పశ్చిమాసియా యుద్ధంపై విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ప్రకటన మినహా లోక్‌సభలో ఎలాంటి అర్థవంతమైన కార్యకలాపాలు జరగలేదు. ప్రతిపక్ష సభ్యులు పశ్చిమాసియా పరిస్థితిపై చర్చకు పట్టుబడుతూ ప్లకార్డులతో వెల్‌లోకి ప్రవేశించి నినాదాలు చేయడంతో ప్యానెల్ స్పీకర్ జగదంబికా పాల్ సభను పలుమార్లు వాయిదా వేయవలసి వచ్చింది. తొలుత ఉదయం 11 నుంచి 12 గంటలకు, తర్వాత మఽధ్యాహ్నం 3 గంటల వరకు, చివరకు మంగళవారానికి సభ వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చకు అంగీకరించే ప్రసక్తి లేదని జగదంబికాపాల్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు తమ నిరసన నిలిపివేస్తే స్పీకర్‌పై అభిశంసన తీర్మానంపై చర్చ నిర్వహిస్తానన్నారు.