ఆపరేషన్ కగార్‌కు.. నేడే చివరి రోజు!
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:10 AM
దేశంలో మావోయిస్టులను, నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు నేటి ...
నేటితో ముగియనున్న అమిత్‌షా డెడ్‌లైన్
అజ్ఞాతంలోనే అగ్రనేతలు గణపతి, బెస్రా, నరహరి
మొత్తంగా100 మంది నక్సల్స్ ఉన్నట్లు గుర్తింపు
వారికోసం అడవులను జల్లెడ పడుతున్న బలగాలు
వీరంతా పట్టుబడితేనే ఆపరేషన్ కగార్ పరిపూర్ణం
గణపతి లొంగిపోతే వైద్యం అందిస్తాం: డీజీపీ
హైదరాబాద్ /చర్ల, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): దేశంలో మావోయిస్టులను, నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు నేటి (మార్చి 31)తో ముగుస్తోంది. అయితే, ఇప్పటికీ పలువురు కీలక మావోయిస్టు నేతలు అజ్ఞాతంలోనే ఉండటంతో.. ఆపరేషన్ కగార్ అసంపూర్తిగానే మిగిలింది. వేలమంది బలగాలతో అడవులను జల్లెడ పడుతున్నా కేంద్ర కమిటీ సభ్యులు గణపతి, మిసెల్ బెస్రా, పసునూరి నరహరి తదితర నేతల ఆచూకీ లభించలేదు. వారిని పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో సుమారు 10 వేల మంది బలగాలు అడవుల్లో అవిశ్రాంతంగా గాలిస్తున్నాయి.
కగార్‌కు బీజం ఇలా..
2004 నుంచి 2021 వరకు దండకారణ్యంలో మావోయిస్టులదేపై చేయిగా ఉంది. ఆ ఏడాది మార్చి 21న బీజాపూర్ జిల్లా తెర్రం అడవుల్లో సీఆర్‌పీఎఫ్ బలగాలపై మావోయిస్టు నేత హిడ్మా బృందం దాడిచేసి 21 మందిని హత్య చేసింది. ఆ ఘటన తర్వాత దేశంలో మావోయిస్టులు లేకుండా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శపథం చేశారు. రెండేళ్ల తర్వాత ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 225 ఎన్‌కౌంటర్లు జరగ్గా, సుమారు 490 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2,550 మంది లొంగిపోయారు. 1,813 మంది అరెస్టయ్యారు. ఎన్‌కౌంటర్లలో 41 మంది జవాన్లు కూడా మృతి చెందారు. దేశంలో మావోయిస్టు పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పుడు మావోయిస్టు పార్టీలో 14 మంది కేంద్ర కమిటీ సభ్యులున్నారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో పార్టీ చీఫ్ బసవరాజు, చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల రవి, భాస్కర్, ప్రయాగ్, కట్టా రామచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణరెడ్డి, హిడ్మా, గణేష్ మృతి చెందారు. దేవ్‌జీ, సోను, సతీష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ప్రస్తుతం జార్ఖండ్‌కు చెందిన బెస్రా, తెలంగాణ చెందిన గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్, వర్త శేఖర్ అలియాస్ మంగ్తు, జోడే రత్నబాయి అలియాస్ సుజాత, నక్క సుశీల అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి తదితరులు అజ్ఞాతంలో ఉన్నారు. గణపతి, ఆయన భార్య సుజాతతోపాటు మరొకరికి సంబంధించిన ఎలాంటి సమాచారం పోలీసుల వద్ద లేదని తెలిసింది. మిగతా ముగ్గురు మాత్రం లొంగుబాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దళ సభ్యులు, డీవీసీఎం ఇతర నాయకులు కలిసి మొత్తంగా 100 మందికిపైగా అజ్ఞాతంలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా లొంగిపోయినా, పట్టుబడినా, ఎన్‌కౌంటర్లలో మరణించినాదేశం మావోయిస్టు రహితంగా మారుతుంది. వీరు లొంగిపోకపోతే ఎన్‌కౌంటర్లు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
గణపతి లొంగిపోతే వైద్యం అందిస్తాం: డీజీపీ
తమకు ఉన్న సమాచారం మేరకు గణపతి వయోభారం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఆయన జనజీవన స్రవంతిలోకి తిరిగి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లో తగిన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు.