దేశంలో క్యాన్సర్ కేర్ సెంటర్లలో పనిచేసేవి 34 శాతం మాత్రమే!
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:30 AM
జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటుకు ఆమోదించిన డే కేర్ క్యాన్సర్ సెంటర్ల(డీసీసీసీ)లో దేశ వ్యాప్తంగా 34 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిలోనూ మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ..
వాటిలోనూ అత్యధికం తెలంగాణ, బిహార్, కర్ణాటకల్లోనే..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 : జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటుకు ఆమోదించిన డే కేర్ క్యాన్సర్ సెంటర్ల(డీసీసీసీ)లో దేశ వ్యాప్తంగా 34 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిలోనూ మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ, బిహార్, కర్ణాటకల్లోనే అధిక శాతం పనిచేస్తుండడం గమనార్హం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటుకు ఆమోదించిన 297 డీసీసీసీల్లో 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 డీసీసీసీలు పనిచేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పార్లమెంటులో తెలియజేసింది. వీటిలో కర్ణాటకలో 16, రాజస్థాన్‌లో 8, తెలంగాణలో 27, త్రిపురలో 3 చొప్పున వంద శాతం పనిచేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బిహార్, హిమాచల్‌ప్రదేశ్‌లకు కేటాయించిన వాటిలో 50 శాతానికి పైగా పనిచేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఒక్క కేంద్రం కూడా పనిచేయడం లేదు. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటుకు ఆమోదించిన వాటిలో ఒక్క కేంద్రం కూడా పనిచేయడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది.